అవిశ్వాసానికి థాంక్యూ..!

Modi 'thanks' Congress for no-trust motion, says it exposed - Sakshi

మీ అజ్ఞానమే బయటపడింది

విపక్షాలపై మోదీ వ్యంగ్యాస్త్రం

న్యూఢిల్లీ: పార్లమెంట్లో తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆ తీర్మానం వల్ల ప్రతిపక్షాల అజ్ఞానాన్ని, అవగాహన లేమిని బట్టబయలు చేయగలిగామన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మంగళవారం ఆయన ప్రసంగించారు. ‘వారు (విపక్షాలు) తెచ్చిన తీర్మానం వారి రాజకీయ అపరిపక్వతను, అపరిణతిని, అవగాహన లేమి, విషయ పరిజ్ఞాన లేమి మొదలైనవాటినే బయటపెట్టింది’ అని మోదీ వ్యంగ్య బాణాలు విసిరారు. తీర్మానంపై చర్చలో హోంమంత్రి రాజ్‌నాథ్‌ చేసిన ప్రసంగాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని.. ఆ ప్రసంగాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలను కోరారు. అవిశ్వాస తీర్మానం గురించి భేటీలో పాల్గొన్న బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, కేంద్రమంత్రులు గడ్కరీ, సుష్మా స్వరాజ్‌ తదితరులు కూడా మాట్లాడారని కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ మీడియాకు తెలిపారు. సాధారణంగా ప్రభుత్వ పక్షం మెజారిటీ కోల్పోయినప్పుడు అవిశ్వాస తీర్మానం పెడ్తారని, కానీ ఈ సందర్భంలో అలాంటి పరిస్థితేమీ లేదని వారు విమర్శించారన్నారు.

ఐడియాలివ్వండి
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించాల్సిన అంశాలను సూచించాల్సిందిగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘నా ఆగస్ట్‌ 15 ప్రసంగంలో ఏ అంశాలుంటే బావుంటుంది? మీ ఆలోచనలు, ఐడియాలను నరేంద్ర మోదీ యాప్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఒక ఫోరమ్‌లో నాతో పంచుకోండి. మీ సూచ నల కోసం ఎదురు చూస్తుంటా’ అని మోదీ ట్వీట్‌ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం కోసం పౌరుల సూచనలు కోరే సంప్రదాయాన్ని మూడేళ్లుగా మోదీ పాటిస్తున్నారు. మైగవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా కూడా సూచనలు పంపించవచ్చు. ఇప్పటికే ఆ వెబ్‌సైట్లో ఇందుకు సంబంధించిన పలు సూచలను ప్రజలు చేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top