కుమ్మక్కు రాజకీయాలు అభివృద్ధికి ఆటంకం | MLA Koramutla Srinivasulu Comments On CM Chandrababu YSR Kadapa | Sakshi
Sakshi News home page

కుమ్మక్కు రాజకీయాలు అభివృద్ధికి ఆటంకం

Jul 23 2018 12:08 PM | Updated on Jul 23 2018 12:08 PM

MLA Koramutla Srinivasulu Comments On CM Chandrababu YSR Kadapa - Sakshi

మాట్లాడుతున్న ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తదితరులు

రైల్వేకోడూరు (వైఎస్సార్‌ కడప): రాష్ట్ర విభజన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు  కుమ్మక్కు రాజకీయాలతో రాష్ట్రాభివృద్ధికి ఆటంకమని వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరి నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన ఎమ్మెల్యేతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న కడపకు ఉక్కు పరిశ్రమ, రైల్వేజోన్, విద్యాసంస్థలు  తదితర వాటిని సాధించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

బీజేపీతో నాలుగేళ్లపాటు అంటకాగి మంత్రి పదవులు అనుభవించి పార్టీ నాయకులు సొమ్ము దండుకోవడానికి ప్రత్యేకప్యాకేజి ఒప్పుకుని రాష్ట్రానికి సీఎం తీరని అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలు తనను సాగనంపుతారని గ్రహించి చంద్రబాడు కొత్త నాటకాలకు తెరతీశారన్నారు. పార్లమెంట్‌లో  ప్రధాని నరేంద్రమోది, రాజ్‌నాథ్‌సింగ్‌ చంద్రబాబు నాటకాలను బయటపెట్టారని తెలిపారు. దీంతో చంద్రబాబుకు ఓటు ఎందుకు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు.

మొదటి నుంచి ప్రత్యేకహోదా సాధనకు పోరాటాలు చేసింది  వైఎస్సార్‌సీపీ మాత్రమేనని వారు గుర్తు చేశారు. నేటికీ ప్రత్యేకహోదా ఉద్యమం సజీవంగా ఉందంటే అది జగన్‌ చేసిన పోరాటాల వల్లనే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెనగలూరు, రైల్వేకోడూరు జెడ్పీటీసీలు కొండూరు విజయ్‌రెడ్డి, మారెళ్ల రాజేశ్వరి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి, ఓబులవారిపల్లె పార్టీ నాయకులు వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, రైల్వేకోడూరు నాయకులు గుంటిమడుగు సుధాకర్‌రాజు, సీహెచ్‌ రమేష్, గోపగాని సులోచన యాదవ్, జనార్ధన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

రేపటి బంద్‌ను విజయవంతం చేయండి
రాష్ట్ర భవిష్యత్‌ కోసం ఈ నెల 24న ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న బంద్‌ను విజయవంతం చేయాలని ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కోరారు. బంద్‌లో విద్యార్థి సంఘాలు, అన్ని పార్టీన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement