
మైకేల్ బేట్స్ సభ నుంచి వాకౌట్ చేస్తున్న ఫోటో (ఇన్‌సెట్‌లో బేట్స్ ఫైల్ ఫోటో)
లండన్ : సాధారణంగా ఎవరైనా కాస్త ఆసల్యం అయితే క్షమాపణలు చెప్పి సరిపెడుతుంటారు. కానీ, ఇక్కడ ఓ మంత్రి తన పదవికే రాజీనామా చేయటం బ్రిటన్‌లో కలకలం రేపింది. మంత్రి మైకేల్ బేట్స్ తన పదవికి రాజీనామా చేసి అర్థంతరంగా సభ నుంచి నిష్క్రమించారు. ఈ ఉదంతం బ్రిటన్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
బుధవారం హౌస్ ఆఫ్ లార్డ్స్(ఎగువ సభ) సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఆ సమయంలో లేబర్ పార్టీ నేత బరోనెస్ రుత్ లిస్టర్ ఓ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. అయితే దానికి సమాధానం చెప్పాల్సిన మంత్రి మైకేల్ బేట్స్(డీఎఫ్‌ఐ శాఖ) తన సీట్‌లో లేరు. సభకు ఆయన కాస్త ఆలస్యంగా వచ్చారు. హుటాహుటిన తన కుర్చీ వద్దకు వచ్చిన బేట్స్... ‘సభకు ఆలస్యంగా వచ్చినందుకు సిగ్గు పడుతున్నా.నా రాజీనామా లేఖను ప్రధానికి అందజేస్తా. లిస్టర్‌కు నా క్షమాపణలు’’ అంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆయన వెళ్తున్న సమయంలో కొందరు సభ్యులు వద్దని ఆయన్ని ఆపే యత్నం చేయగా.. మరికొందరు అదంతా ఆయన సరదాగా చేస్తున్నారని నవ్వుకున్నారు. కానీ, అవేం పట్టన్నట్లు బేట్స్ బయటికి వెళ్లిపోయి మళ్లీ తిరిగి లోపలికి రాలేదు. ఇదంతా కేవలం నిమిషం వ్యవధిలో జరగటం విశేషం.
ఇంత చిన్న విషయానికి క్షమాపణలు చెబితే సరిపోయేదని.. రాజీనామా వ్యవహారం మరీ అతిగా ఉందని తోటి సభ్యులు చెబుతున్నారు. దీనిపై లిస్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అలా చేసి ఉండాల్సింది కాదన్న ఆమె.. తక్షణమే రాజీనామా ఉపసంహరణ చేసుకోవాలని బేట్స్ కు సూచించారు. అయితే ఆయన రాజీనామా తిరస్కరణకు గురైందని.. పదవిలో కొనసాగుతారని లార్డ్స్ ఆఫ్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
బేట్స్ 2008 నుంచి లార్డ్స్ ఆఫ్ హౌజ్ లో సభ్యుడిగా ఉన్నారు. 2016 నుంచి ఆయన మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇన్నేళ్లలో ఏనాడూ తాను సభకు ఆలస్యం కాలేదని ఆయన తర్వాత తోటి సభ్యుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఈయనగారి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.