రైతులను మోసం చేసింది చంద్రబాబే

Minister Kurasala kannababu Fires On Chandrababu Naidu - Sakshi

రైతులను నమ్మించి మోసం చేశారు

ఆయనకు ప్రజల శ్రేయస్సు పట్టదు

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

కాకినాడ రూరల్‌: ద్రోహానికి చంద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌ అని, దగాకు పేటెంట్‌ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని రైతు బాంధవుడిగా రాష్ట్ర ప్రజలు కీర్తిస్తుంటే ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాకినాడలోని తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కన్నబాబు ఏమన్నారంటే..
► రాజశేఖరరెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవం నిర్వహించాం. రైతు సంక్షేమం కోసం రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పది అడుగులు ముందుకు వేశారు.
► ఎన్టీఆర్‌ను దగా చేసిన చంద్రబాబు.. ఇప్పుడు రైతులకు రాజశేఖరరెడ్డి, జగన్‌ ద్రోహం చేశారని కావాలని, పనిగట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన మాటల్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరు.
► రైతులకు 2014లో రూ.87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని నమ్మించిన చంద్రబాబు, దానిని రూ.27 వేల కోట్లకు కుదించి, చివరకు కేవలం రూ.15 వేల కోట్లతో సరిపెట్టారు. 
► వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతులకు రూ.14,832 కోట్లు చెల్లించారు. 8.5 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేశారు. బకాయిలు చెల్లించారు. పది వేల జనతా బజార్లు త్వరలో ఏర్పాటు చేస్తున్నారు. అగ్రికల్చర్‌ అడ్వైజరీ బోర్డులు ఏర్పాటు చేశారు.
► విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదంలో మృతులకు రూ.కోటి చొప్పున పరిహారం అందించారు. గాయపడిన వారికి కూడా పరిహారం ఇచ్చారు. రెండు నెలల్లోనే విచారణ ఆధారంగా అరెస్టులు చేశారు. భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ ప్రమాద బాధితులకు ఇప్పటికీ పరిహారం అందని పరిస్థితి.
► జూమ్‌ యాప్‌తో వీడియో కాన్ఫరెన్సులు పెట్టడం తప్ప ప్రజలకు అవసరమయ్యే పని చంద్రబాబు చేయడం లేదు. అమరావతి తప్ప ఆయనకు ప్రజల శ్రేయస్సు పట్టదు.
► రైతులకు ఉచిత బీమా, సున్నా వడ్డీ, ఉచిత బోర్లు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల ఏర్పాటు వంటి ఆలోచనలు చంద్రబాబుకెందుకు రాలేదు? ఇన్ని చేస్తుంటే రైతు దగా దినోత్సవమని చెప్పడం దుర్మార్గం.
► వ్యవసాయంపై యనమల రామకృష్ణుడు వ్యాసం రాశారు. నిమ్మకాయల చినరాజప్ప ప్రెస్‌మీట్‌ పెట్టారు. ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారో ఇప్పుడైనా ఆలోచించుకోవాలి.

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో మినీ విత్తన శుద్ధి పరిశ్రమ
ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక మినీ విత్తన శుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. ఈ పరిశ్రమ కోసం ఒక్కోదానికి రూ.60 లక్షలు కేటాయించామన్నారు. విశాఖ జిల్లా చోడవరం మండలం గంధవరంలో విత్తన శుద్ధి పరిశ్రమ నిర్మాణానికి గురువారం ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి కన్నబాబు మాట్లాడారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top