ఎగిరేది గులాబీ జెండానే

Minister KTR At a Meeting of TRS Activists at Nalgonda Dist - Sakshi

కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలనలో జిల్లాను అభివృద్ధి చేయలేదు

నల్లగొండ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్‌

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో నల్లగొండ జిల్లా నుంచి పెద్ద పెద్ద పదవులు పొంది కాంగ్రెస్‌ నాయకులే ఎదిగారు తప్ప జిల్లాను అభివృద్ధి చేయలేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ విమర్శించా రు. జిల్లాలో ఫ్లోరిన్‌ పాపం కాంగ్రెస్‌ నాయకుల పుణ్యమేనని దుయ్యబట్టారు. ఈ ఐదేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా 50 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించిం దన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రం లోని లక్ష్మీ గార్డెన్స్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన జిల్లా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 

హుజూర్‌నగర్‌పై గులాబీ జెండా ఖాయం 
హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘గతంలో హుజూర్‌నగర్‌ ఎన్నికల్లో ఎన్నో ప్రయత్నాలు చేశాం. మా ప్రయత్నాలకు యువకుడు సైదిరెడ్డి తోడయ్యారు. కానీ ట్రక్కు గుర్తు అండ తో కాంగ్రెస్‌ బయటపడింది. కానీ ఈసారి వెయ్యి శాతం కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవడం ఖాయం’అని జోస్యం చెప్పారు. నల్లగొండను ఐదు దశాబ్దాలపాటు నట్టేట ముంచిన కాంగ్రెస్‌ కావాలో లేక తెలంగాణ తెచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ కావాలో తేల్చుకోవా ల్సిన తరుణం ప్రజలకు వచ్చిందన్నారు. 

టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ధి... 
కాంగ్రెస్‌ గెలిస్తే సాధించేది ఏమీ లేదని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జిల్లాను ఎంతో అభివృద్ధి చేసిందన్నా రు. సూర్యాపేట, యాదాద్రి జిల్లాల ఏర్పాటుతో పాలన వికేంద్రీకరణ జరిగిందన్నారు. ఇచ్చిన మాటను కాంగ్రెస్‌ తుంగలో తొక్కితే, టీఆర్‌ఎస్‌ తండాలను పంచాయతీలుగా చేసిందని గుర్తుచేశారు. బతుకమ్మ చీరలు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్, విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం వంటి పథకాలను మేనిఫెస్టోలో పెట్టకున్నా సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేనివిధంగా వాటిని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 50 ఏళ్ల కాలంలో జిల్లాలో మెడికల్‌ కళాశాల లేదని, కానీ తాము వచ్చాక నల్లగొండ, సూర్యాపేటల్లో మెడికల్‌ కళాశాలలతోపాటు బీబీ నగర్‌ వద్ద ఎయిమ్స్‌ను కూడా ఏర్పాటు చేశామని కేటీఆర్‌ వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ మనుషులనే కాదు.. దేవుడిని కూడా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.   

ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్, బీజేపీ... 
కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నాయని, తెలంగాణ ప్రజల గుండెల్లో ఎవరి స్థానం ఏమిటో తేల్చుకునేందుకు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక మంచి అవకాశమని కేటీఆర్‌ పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికను పార్టీ శ్రేణులంతా సవాలుగా తీసుకొని ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ‘టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి, ఉత్తమ్‌ అంత ఎత్తు ఉండకపోవచ్చు, అంత డబ్బూ ఉండకపోవచ్చు, కానీ మంచి మనిషి. ఉప ఎన్నికలో ఆయన గెలుపును ఎవరూ ఆపలేరు’ అని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిపోయిందని, కాంగ్రెస్‌ నేతలు చివరకు తమకు ఓట్లు వేసిన ప్రజలను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు.

నేతన్నను ఆదుకునేందుకే..
నల్లగొండ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు సముదాయంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యమ నాయకుడిగా సీఎం కేసీఆర్‌ చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలను చూసి చలించిపోయారని, వారి ని ఆదుకోవాలని నాటి ప్రభుత్వాలకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. దాంతో కేసీఆర్‌ భిక్షాటన చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పోచంపల్లిలో ఆత్మహత్యలు చేసుకున్న ఏడుగురు చేనేత కార్మికుల కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే వారికి భరోసా కల్పించే విధంగా బతుకమ్మ చీరలు తయారు చేయిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలకు చీరలు అందించేలా పథకాన్ని రూపొందించి ఆ చీరల తయారీని నేతన్నలకు అప్పగించామన్నారు. సీఎం కేసీఆర్‌ పెద్దన్నలా తెలంగాణలో కోటి చీరలను తయారు చేయించి ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ చేనేత కార్మికులు ఉన్నారో వారందరికీ బతుకమ్మ చీరల తయారీతోపాటు ప్రభుత్వ శాఖల్లోని యూనిఫారాల తయారీ బాధ్యతను కూడా అప్పగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top