నెటిజన్లతో కేటీఆర్‌ ముచ్చట.. సరదా సరదా ప్రశ్నలు

Minister KTR Interacted With Netizens on Twitter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్విటర్‌లో నెటిజన్లతో ముచ్చటించారు. ఆస్క్‌ కేటీఆర్‌ యాష్‌ట్యాగ్‌తో (#AskKTR) ఆయనకు ట్యాగ్‌ చేస్తూ.. అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. కొన్ని సరదా ప్రశ్నలు.. కొన్ని సీరియస్‌ ప్రశ్నలు.. తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వ పనితీరుపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు బదులు ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లేదా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ కొందరు నెటిజన్లు కోరగా.. వచ్చే ఎన్నికల్లో తాను సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేసే అవకాశముందా అని గుంటూరు వ్యక్తి ప్రశ్నించగా.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమంటూ పేర్కొన్నారు. డిసెంబర్‌లో సాధారణ ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటారని అడగ్గా.. ఎన్నికలు డిసెంబర్‌లో వచ్చినా.. వచ్చే ఏడాది వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ రోజు జరిగే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఎవరూ గెలుస్తారని కేటీఆర్‌ను ప్రశ్నించగా.. ఎవరు గెలిచినా ఆనందమేనంటూ బదులిచ్చారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన కొన్ని సరదా ప్రశ్నలకు కేటీఆర్‌ కూడా సరదా సరదాగా సమాధానం ఇచ్చారు. మీకు నచ్చిన బీర్‌ ఏది అని ఓ నెటిజన్‌ అడుగగా.. ఆ విషయం చెప్పను అంటూ కేటీఆర్‌ బదులిచ్చారు. అమ్మాయిల ప్రశ్నలకు మీరు రిప్లై ఇవ్వడం లేదంటూ ఓ యువతి ప్రశ్నించగా.. ఎంత ధైర్యం నాకు అంటూ కేటీఆర్‌ బదులిచ్చారు. మీ ఫేవరేట్‌ ఫుట్‌బాలర్‌ ఎవరు అని అడిగితే.. మెస్సీ అని బదులిచ్చిన కేటీఆర్‌.. మీకు ఇష్టమైన కమెడియన్‌ ఎవరు అని ప్రశ్నిస్తే.. రాజకీయల్లో అడుతున్నావు కదా అని దాటవేశారు. తదుపరి ముఖ్యమంత్రి కేసీఆరేనని స్పష్టం చేసిన కేటీఆర్‌.. మోదీ, రాహుల్‌గాంధీలో ఎవరిని ఎంచుకుంటారంటే.. ప్రశ్నను ప్రశ్నగానే వదిలేస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో కేటీఆర్‌.. మరీ ఆంధ్రలో ఎవరు? అని ప్రశ్నిస్తే.. కాలేజీని వీడగానే ఖాళీలు పూరించడం ఆపేశానంటూ బదులిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top