‘ఎమర్జెన్సీ’ని గుర్తు చేసుకోండి!

Minister KTR Fires On Rahul Gandhi In Twitter - Sakshi

రాహుల్‌ గాంధీపై ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ విసుర్లు

వాక్‌ స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడటంపై ఎద్దేవా

సాక్షి, హైదరాబాద్‌: ‘‘వాక్‌ స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛ గురించి మీరా మాట్లాడేది? వాహ్‌.. రాహుల్‌ జీ!. స్వతంత్ర భారతావనిలో విధించిన ఏకైకఅత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని మీకు ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుర్తు చేస్తున్నా. ప్రజాస్వామికవాదుల గొంతులను నొక్కింది ఎవరు? ప్రజాస్వామిక విలువలను మంటగలిపింది ఎవరు? మీ స్కాంగ్రెస్‌ పార్టీ కాదా?’’అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై మంత్రి కె. తారక రామారావు ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. రాష్ట్ర పర్యటనలో రాహుల్‌ గాంధీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు మంగళవారం కేటీఆర్‌ వరుస ట్వీట్లతో బదులిచ్చారు.

తెలంగాణ అమరవీరుల స్మారకం వద్ద నువ్వు ఎవరికి నివాళులు అర్పించావో నీకు తెలుసా? అని రాహుల్‌ను ప్రశ్నించారు. ‘‘తొలి దశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా 1969లో ఇందిరా గాంధీ నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపిన 369 మంది యువకులతోపాటు తెలంగాణ ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించడంతో 2009–14 మధ్యలో ఆత్మబలిదానం చేసుకున్న యువకులు వారు’’అని కేటీఆర్‌ గుర్తు చేశారు.

ఈ మరణాలకు క్షమాపణ చెప్పరా? అని రాహుల్‌ను నిలదీశారు. ‘‘అవినీతి గురించి మాట్లాది నువ్వా? నీతో వేదిక పంచుకున్న సగం మంది కాం గ్రెస్‌ నేతలు సీబీఐ, ఇతర అవినీతి కేసుల్లో బెయిల్‌పై బయటకు వచ్చిన వారే. ఓహ్‌.. నేను మర్చిపోయా.. ఇది స్కాంగ్రెస్‌ పార్టీ కదా. ఆంగ్ల అక్షరం ‘ఏ’ ఫర్‌ ఆదర్శ్, బీ ఫర్‌ బోఫోర్స్, సీ ఫర్‌ కామన్వెల్త్‌..’’అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకంగా స్థానిక కాంగ్రెస్‌ నేతలు వేసిన, వేయించిన వందలాది కేసులు ఉపసంహరించేలా వారిని ఆదేశించాలని రాహుల్‌కు సూచించారు. లేకుంటే అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకమనే ముద్రపడుతుందన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top