‘అప్పుడేమో ఎగతాళి.. ఇప్పుడేమో అవిశ్వాసం’ | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 19 2018 10:51 AM

Mekapati Rajamohan Reddy Slams To CM Chandrababu Over On No conference Motion - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అవిశ్వాసంపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తామే చాంపియన్ అనిపించుకోవాలనే టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని దుయ్యబట్టారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని మేకపాటి ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీలు కలిసి లాలుచీ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

‘టీడీపీ సొంత ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే తపన తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. ఎగతాళి చేసిన చంద్రబాబే అవిశ్వాసం పెట్టారు. విభజన హామీలు నెరవేర్చాలని మొదటి నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరుతోంది. రాష్ట్ర సమస్యలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరిష్కారం చూపుతారు. వైఎస్ జగన్‌ వస్తేనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది’ అని వైఎస్సార్‌సీపీ నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.

పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గురువారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణలు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నేతలు నినాదాలు చేశారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement