మా ఇల్లే బృందావనం: పద్మా దేవేందర్‌ రెడ్డి

Medak MLA Padma Devender Reddy chit chat with sakshi - Sakshi

అమ్మ అండ.. భర్త సహకారం మరువలేను

మూడో తరగతిలో నాన్నకు ఉత్తరం తీపి జ్ఞాపకం

మాకు గ్రామాలే టూరిస్ట్‌ ప్రాంతాలు

ఇప్పటికీ స్నేహితులందరం కలుస్తాం

సాక్షి, మెదక్‌ : అమ్మే ధైర్యం.. ఆమె ఆశీర్వాదమే నా బలం అని అంటున్నారు అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి. అమ్మకు తోడుగా మా వారి అండతోనే ఈ స్థాయికి చేరా.. ఆయనే నా రాజకీయ గురువు.. వారి ప్రోద్బలంతోనే తెలంగాణ ఉద్యమం, ప్రత్యక్ష రాజకీయాల్లో నాదైన ముద్ర వేసుకున్నా.. అని గర్వంగా చెబుతున్నారు. వరుస ఎన్నికలు, నిత్య రాజకీయాల్లో తలమునకలైన ఆమె శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. చిన్ననాటి తీపి గుర్తులు, ఇష్టమైన వంటకాలు, స్నేహితులు, బంధువులతో అనుబంధాన్ని పంచుకున్నారు. పుట్టినిల్లయినా.. అత్తారిల్లయినా.. మా ఇళ్లే ఒక బృందావనం అని అంటున్న పద్మాదేవేందర్‌రెడ్డి ‘పర్సనల్‌ టైం’ ఆమె మాటల్లోనే.. పుట్టినింట్లో ప్రెండ్లీగా ఉండేటోళ్లం. అత్తారింటికి వచ్చాక పద్ధతులు మారాయి. అక్కడైనా, ఇక్కడైనా క్రమశిక్షణతో ఉండడం అలవర్చుకున్నా. ఏ ఇల్లు అయినా ఒక బృందావనమే. చిన్న కోడలు కావడంతో అత్తవారింట్లోకి ఒకింత భయంతో అడుగుపెట్టినా.. మా ఆయన బంగారం కావడంతో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు.  

ఆ ఉత్తరం తీపి జ్ఞాపకం
మాది కరీంనగర్‌ జిల్లా నామాపూర్‌ గ్రామం. అమ్మ విజయ, నాన్న భూమిరెడ్డి. మేం ముగ్గురు సంతానం. నేనే పెద్ద కూతురిని. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. ఆదిలాబాద్‌ జిల్లా తోటపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో టీచర్‌గా పనిచేసేవారు. ఇంటి వద్ద అమ్మ ఒక్కతే మా ఆలనాపాలనా చూసేది. నాన్న సెలవు రోజుల్లో వచ్చి మా యోగక్షేమాలు తెలుసుకుని.. మళ్లీ డ్యూటీకి వెళ్లేవారు. దీంతో అమ్మతోనే ఎక్కువ అనుబంధం ఉండేది. అమ్మ నాతో స్నేహితురాలిగా మెలిగేది. అమ్మ ఆశీర్వాద బలంతోనే తెలంగాణ ఉద్యమంలోకి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి  వచ్చా.  నాన్న దూరంగా ఉన్నప్పుడు మా అమ్మ నాతో మొదటిసారి నాన్నకు ఉత్తరం రాయించింది. నేను అప్పుడు మూడో తరగతి చదువుతున్నాను. అది ఎప్పటికీ మరువలేని తీపి జ్ఞాపకం.

విద్యాభ్యాసం
సొంతూరు కరీంనగర్‌ జిల్లా నామాపూర్‌లో ఏడో తరగతి వరకు విద్యనభ్యసించా. ఎనిమిది నుంచి డిగ్రీవరకు కరీంనగర్‌లో చదువుకున్నా. ఆ తర్వాత హైదరాబాద్‌లోని పెండెకంటి లా కాలేజీలో న్యాయ విద్యనభ్యసించా. 

స్నేహబంధం కంటిన్యూ
చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు స్నేహబంధం కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ, మంగ, అరుణ ఇంకొందరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. పెళ్లి అయినప్పటికీ స్నేహితుల ఇళ్లలో జరిగే ఏ కార్యక్రమాలకైనా హాజరయ్యేదాణ్ని. ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ అయిన తర్వాత కొంత తగ్గినప్పటికీ.. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరి ఇంట్లో అందరం స్నేహితులం కలుస్తాం. నేను వెళ్లినా.. వెళ్లకున్నా.. ఈ ట్రెండ్‌ ఇప్పటివరకు కొనసాగుతుండడం సంతోషంగా ఉంది. 

గ్రామాలే విడిది కేంద్రాలు
చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణంలోనే ఉన్నాం. కోడి కూతతో తెల్లవారడం.. పాడి పశువులు ఇంటిబాట పట్టినప్పుడు పొద్దుగూకడం వంటి వాతావరణంలో పెరిగినం. చిన్నప్పుడైనా కావొచ్చు.. ఇప్పుడైనా కావొచ్చు విలేజీ వాతావరణంలోనే ఉండాలని అనిపిస్తుంది. మేము, మా కుటుంబ సభ్యులం ప్రత్యేకంగా ఎలాంటి టూర్లకు వెళ్లం. చిన్నప్పుడు ఏదైనా కార్యక్రమం ఉంటే అమ్మమ్మ, నానమ్మ వాళ్లింటికి వెళ్లేటోళ్లం. ఇప్పడు కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. మాకు గ్రామాలే విడిది కేంద్రాలు. ప్రస్తుతం పల్లెలు పట్టణాలుగా రూపాంతరం చెందుతున్నప్పటికీ.. పల్లె వాతావరణమే మాకు ఇష్టం.

చెంపదెబ్బలు ఫన్నీ
నేను ఐదో తరగతి చదువుతున్న సమయంలో జరిగిన సంఘటన ఇప్పటికీ నాకు నవ్వు తెప్పిస్తుంది. మా సార్‌ చొక్కారావు.. ‘బృహలేశ్వరాలయం’ అని పలకాలని విద్యార్థులకు చెప్పారు. ఎవరు కూడా ఆ పేరు పలకలేకపోయారు. నేను మాత్రమే చెప్పడంతో సార్‌ నన్నెంతో మెచ్చుకుని, తోటి విద్యార్థులకు చెంపదెబ్బలు వేయించారు. నేను మెల్లిగా కొడితే దగ్గరుండి మరీ గట్టిగా వేయించారు. ఈ సంఘటన నాకు చిన్ననాటి తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. 

పునీత్‌.. హ్యాపీ మూమెంట్‌ 
నా కొడుకు పునీత్‌రెడ్డి పుట్టడం జీవితంలో మరచిపోలేను. అది ఇప్పటికి, ఎప్పటికీ నాకు హ్యాపీ మూమెంట్‌. డిప్యూటీ స్పీకర్‌ అయ్యే వరకు నేనే స్వయంగా వంట చేసే దాణ్ని. నేను వంట చేస్తేనే నా కొడుకు పునీత్‌ తినేటోడు. ఇప్పటికీ అప్పుడప్పుడు నా కొడుకు కోసం వంట చేస్తా. కూరగాయలతో భోజనం ఇష్టమైనప్పటికీ.. నాన్‌వెజ్‌ వంటకాలు బాగా చేస్తా.

గోళీలాట, చిర్రగోనె ఇష్టం
రాజకీయ రంగంలోకి రాకముందు ఖాళీ సమయాల్లో సినిమాలు చూసేదాణ్ని. దోస్త్‌లతో కలిసి షాపింగ్‌ అంటే ఇష్టముండేది. ఇప్పుడు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే టీవీ చూస్తున్నా. పుస్తకాలు, నవలలు చదువుతా. చిన్నప్పుడు గోళీలాట, చిర్రగోనె ఆడడం ఇష్టం. రాజకీయాల్లోకి రాక ముందు దినపత్రికలు చదివేదాణ్ని కాదు. ఇప్పుడు ప్రతి పేపరు తప్పకుండా చదువుతా

టీచర్‌. న్యాయవాది కావాలనుకున్నా..
చిన్నప్పుడు క్లాస్‌ ఫస్ట్‌ రావాలని కోరిక. నాన్న టీచర్‌ కాబట్టి చిన్నçప్పుడు నాకు టీచర్‌కావాలనే కోరిక ఉండేది. పెళ్లి అయిన తర్వాత మా ఆయనను చూసి న్యాయవాది కావాలనుకున్నా. లా చదివినప్పటికీ ఆ తర్వాత వృత్తిని చేపట్టలేదు. ఆ తర్వాత తల్లి ధైర్యం, భర్త ప్రోత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్నా. ఆ తర్వాత రాజకీయ ప్రస్థానం మొదలైంది. 

మా ఆయన బంగారం
మా ఆయన దేవేందర్‌రెడ్డి బంగారం. మా మధ్య చిన్న తగవు కూడా లేదు. దేవేందర్‌రెడ్డిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఉద్యమం, రాజకీయ రంగంలో నా భర్త ప్రోత్సాహం ఎంతగానో ఉంది. ఉద్యమ సమయంలో జైలుకెళ్లడం వంటి ఘటనలతో నా పుట్టింటి వారు, అత్తింటి వారు కొంత ఆందోళనకు గురయ్యారు. మా ఆయన పూర్తిగా సహకారం అందించడంతో తెలంగాణ సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించా. అనంతరం మా ఆయన ప్రోద్బలంతో 2001లో జెడ్పీటీసీగా గెలిచా. టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ అయ్యా.  అప్పుడు నాకు ఎలా చేయాలి.. ఏం చేయాలి వంటి విషయాలు పెద్దగా తెలవదు. నా భర్త సహకారంతో అన్నీ తెలుసుకున్నా. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2004లో రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజల ఆశీస్సులతో మూడు దఫాలుగా ఎమ్మెల్యే అయ్యా. 

కూతురుగా అభివర్ణించడం మరిచిపోలేను
తెలంగాణ ఏ విధంగా అన్యాయానికి గురైంది వంటి అంశాలను పుస్తకాలు చదవడం ద్వారా తెలుసుకున్నా. ప్రధానంగా ఉద్యమ సమయంలో కేసీఆర్‌ స్పీచ్‌ నన్ను ఆకట్టుకుంది. ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్‌.. నన్ను కూతురుగా అభివర్ణించడం, అలానే చూసుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. ఎంతో సంతోషాన్నిచ్చిన సంఘటన అది.

విద్యతోనే మహిళా సాధికారత
ఆడ, మగ పిల్లలనే తేడా చూపొద్దు. నేటి సమాజంలో ఆడపిల్లలను తప్పనిసరిగా చదివించాలి. అదే నా మొదటి ఆకాంక్ష. మహిళల ఆర్థిక స్వాలంబన, మహిళా సాధికారత రావాలంటే విద్యే మూలం అని నా నమ్మకం. మహిళలను పురుషులతో సమానంగా చదివించాలి.  

ప్రొఫైల్‌
పేరు                : పద్మాదేవేందర్‌రెడ్డి
పుట్టిన తేదీ       : 1969 జనవరి 6
పుట్టిన ఊరు     : నామాపూర్‌ (కరీంనగర్‌)
అత్త గారి ఊరు   : కోనాపూర్‌ (మెదక్‌)
వివాహం           : 1988
చదువు            : ఎల్‌ఎల్‌బీ

కుటుంబం
తల్లి               : విజయ
తండ్రి             : భూమిరెడ్డి
సోదరుడు       : వంశీధర్‌రెడ్డి
చెల్లెలు           : అనిత
సంతానం       : పునీత్‌రెడ్డి

రాజకీయ ప్రస్థానం : 2001–04 : జెడ్పీటీసీ (రామాయంపేట), టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌
2009–14     : మెదక్‌ ఎమ్మెల్యే
2014–18     : మెదక్‌ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌
2018 డిసెంబర్‌ నుంచి : మెదక్‌ ఎమ్మెల్యే  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top