10 సీట్లలో పోటీ.. మరో 4 అడుగుతున్నాం! | Major changes in the state with Mahakutami says Kodandaram | Sakshi
Sakshi News home page

10 సీట్లలో పోటీ.. మరో 4 అడుగుతున్నాం!

Nov 6 2018 1:32 AM | Updated on Jul 29 2019 2:51 PM

Major changes in the state with Mahakutami says Kodandaram - Sakshi

సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో టీజేఎస్‌ ఎన్నికల గుర్తు లోగోను విడుదల చేస్తున్న కోదండరాం తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పొత్తుల్లో భాగంగా 10 సీట్లలో టీజేఎస్‌ పోటీ చేయాలని పరస్పరం అనుకున్నామని, ఇంకో నాలుగు సీట్ల కోసం కాంగ్రెస్‌ను అడుగుతున్నామని ఆ పార్టీ అధినేత కోదండరాం చెప్పారు. మహాకూటమి రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టిస్తుందని అన్నారు. ఆ పార్టీ ఎన్నికల గుర్తు అగ్గిపెట్టె లోగోను కోదండరాం సోమవారం ఇక్కడ విడుదల చేశారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను కూడా వెల్లడించారు. పూర్తిస్థాయి మేనిఫెస్టోను ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన తరువాత విడుదల చేస్తామన్నారు. దీపావళి రోజున పొత్తులు ఖరారు చేస్తామన్నారు.

మహాకూటమి ఏర్పాటు ఇప్పటికే పూర్తయితే బాగుండేదని, ప్రచారం బాగా జరిగేదని అభిప్రాయపడ్డారు. కూటమి ఏర్పాటు ప్రజలకు భరోసా కల్పించిందన్నారు. రాజకీయ అవసరాల కోసం కూటమి ఏర్పా టు చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో సీపీఐ పాల్గొన్నదని, ఆ పార్టీని కూటమిలో కలుపుకోవాలని అన్నారు. రాష్ట్రంలో నిరంకుశపాలన అంతం కావాలంటే ప్రజలంతా కూటమిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తులు కేంద్రంగా పరిపాలన ఉండొద్దని అభిప్రాయపడ్డారు. అందుకే తను పోటీ చేసే విషయం కూటమి సీట్లను బట్టి ఆధారపడి ఉంటు ందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అణిచివేతకు పుల్లలు పెడుతామని, ప్రజలకు మంచి చేసే వాళ్లకు అగ్గిపుల్లతో మంగళహారతి ముట్టించి, స్వాగతం చెబుతామన్నారు. ప్రజలకు చెడు చేసేవాళ్ళ చెత్తను కాలబెడతామని కోదండరాం స్పష్టం చేశారు.  

ప్రగతికి పది సూత్రాలు... మేనిఫెస్టో ముఖ్యాంశాలు 
- పారదర్శక, ప్రజాస్వామిక, బాధ్యతాయుత, సుపరిపాలన, పౌర సమాజ సలహాలు, సూచనలు తీసుకోవడానికి అన్ని మార్గాలను ఉపయోగించుకుని, విధాన నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు, ముఖ్యమంత్రి రోజూ ఉదయం ఒక గంట ప్రజలకు అందుబాటులో ఉంటారు. 
సామాజిక న్యాయం, సాధికారత 
అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం 
ఉద్యోగ, ఉపాధికల్పన, ఉపాధి అవకాశాలను విస్తృతపర్చడానికి నైపుణ్యాభివృద్ధి 
వ్యవసాయ అభివృద్ధి 
అన్ని జిల్లాల్లో ఐటీ, పారిశ్రామికాభివృద్ధి, చిన్న, సూక్ష్మ, గృహ పరిశ్రమలకు ప్రాధాన్యం 
- గ్రామీణాభివృద్ధి 
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమం, స్వావలంబన 
- మహిళా సాధికారత 
పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన  

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు: తక్షణ చర్యలు 
రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణాల మాఫీ 
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో లక్ష ఉద్యోగాలు. ప్రతి ఏటా క్యాలెండర్‌ ప్రకటన, ఉపాధి అభించే వరకు అర్హతను బట్టి రూ.3 వేల వరకు నిరుద్యోగభృతి 
ఉద్యమకాలంలో ఉద్యమకారులపై పెట్టిన అన్ని కేసులు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఎత్తివేత. ఏడాదిలోగా హైదరాబాద్‌లో అమరుల స్మృతిచిహ్నం నిర్మాణం 
కౌలు రైతులుసహా వాస్తవ సాగుదారులందరినీ గుర్తించి, వారందరినీ అన్ని ప్రభుత్వ వ్యవసాయ పథకాలకు లబ్ధిదారులుగా గుర్తించడం 
ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు కౌలు రైతులతో సహా నష్టపరిహారం 
ధర్నాచౌక్‌ పునరుద్ధరణ.. తెలంగాణ మ్యూజియంగా ప్రగతిభవన్‌ 
ఈపీసీ వ్యవస్థను రద్దు చేసి, నిర్మాణ పనులను కట్టగట్టి బడా కాంట్రాక్టర్లకు ఇచ్చే పద్ధతికి స్వస్తి  
పేద రైతులను నిరాశ్రయులను చేస్తున్న, భూమి లేని గ్రామీణుల ఉసురు తీస్తున్న రైతు వ్యతిరేక భూసేకరణ చట్టం–2016 చట్టం తొలగింపు. భూసేకరణ చట్టం–2013 యథావిధిగా అమలు. 
ఉన్నతవిద్యను ప్రజలకు దూరం చేయడానికి తెచ్చిన ప్రైవేటు యూనివర్సిటీల చట్టం రద్దు 
పౌరసేవా చట్టం ద్వారా అన్ని పథకాల ప్రయోజనాలు ప్రజలకు హక్కుగా పొందే అవకాశం.

స్థానాల జాబితా కాంగ్రెస్‌ ఇచ్చింది
తెలంగాణ జన సమితి(టీజేఎస్‌)కి ఇవ్వాల్సిన స్థానాల జాబితాను కాంగ్రెస్‌ ఇచ్చిందని కోదండరాం తెలిపారు. ఈ జాబితాపై పార్టీలో చర్చించిన తర్వాత తమ స్పందన తెలియజేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement