అమ్మ పవార్‌.. రాష్ట్రపతి కోసమేనా ఇదంతా?

Maharashtra Govt Formation: Sharad Pawar Big Twist To Shiv Sena And Congress - Sakshi

ఉద్దవ్‌ ఠాక్రేను మహారాష్ట్ర సీఎం అని ప్రకటించిన ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌కు రాత్రికిరాత్రే ఏమైందో కానీ ప్లేట్‌ ఫిరాయించారు. బహిరంగ ప్రకటన ఇచ్చి కనీసం రోజు కూడా మారకముందే తన మనసు, మాట మార్చుకున్నారు. కాంగ్రెస్‌, శివసేనకు భారీ షాక్‌ ఇచ్చి అనూహ్యంగా బీజేపీకి మద్దతు ప్రకటించారు పవార్‌. దీంతో మహా సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఉదయం నిద్ర లేచి టీవీలో వస్తున్న వార్తలు చూసి శివసేన, కాంగ్రెస్‌ నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. పవార్‌కు ఏమైంది? ఎందుకు ఇలా ప్లేట్‌ ఫిరాయించారు? కాంగ్రెస్‌కు సోనియాకు నమ్మిన బంటైన శరద్‌ పవార్‌ ఉన్నట్టుండి ఇలా ఎందుకు చేశారు? అనేది మహారాష్ట్రతో పాటు దేశరాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. (బిగ్‌ ట్విస్ట్‌: సీఎంగా ఫడ్నవిస్‌ ప్రమాణం

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి శివసేన ముఖ్య నేతలతో రోజు సమావేశం.. అంతేకాకుండా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మూడు సార్లు అధికారిక భేటీ.. అనధికారికంగా అనేకమార్లు. ఇవి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకై జరిపిన సమావేశాలు, చర్చలు. కానీ ఇవన్నీ ఒకే ఒక్క భేటీతో తుడిచిపెట్టుకపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీతో శరద్‌ పవార్‌ భేటీ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై చాలా మెత్తబడ్డారు. అనంతరం సోనియా అక్షింతలు వేయడంతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ల కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మహా సీఎంగా శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే అంటూ సంయుక్తంగా ప్రకటించింది. అంతేకాకుండా సంకీర్ణ ప్రభుత్వానికి హెడ్‌ ఉద్దవ్‌ ఠాక్రే అంటూ స్పష్టం చేసింది. దీంతో శివ సేన సంబరాల్లో మునిగిపోయింది. ముఖ్యంగా ఠాక్రే కుటుంబ సభ్యులు ఆనందంలో తేలియాడారు. తొలిసారి ఠాక్రే వంశస్థులు ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారని. అయితే వారికి తెలియదు కదా ముందున్న ఉపద్రవం గురించి. 

అయితే శరద్‌ పవార్‌పై అనుమానమో లేక వేరే కారణాలో తెలియవు కానీ ఆయన చేతనే మహా సీఎం ఉద్దవ్‌ ఠాక్రే అని ప్రకటింప చేసేలా చేశారు సోనియా గాంధీ. ఎందుకంటే మాట తప్పిన చరిత్ర పవార్‌పై రుద్దాలనే ఆలోచన కాంగ్రెస్‌ చీఫ్‌కు ఉన్నట్లుంది. ఇక అంతా అయిపోయింది మూడు పార్టీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైంది అనుకున్న తరుణంలో అనూహ్యంగా బీజేపీతో చేతులు కలిపింది ఎన్సీపీ. ఇప్పుడు అందరి మదిలోనూ కదులుతున్న ప్రశ్నలు అనేకం. అసలు రాత్రిరాత్రికి ఏమైంది? ఉద్దవ్‌ ఠాక్రే సీఎం అని ప్రకటించిన వెంటనే.. మోదీ, అమిత్‌ షాలు శరద్‌ పవార్‌తో మాట్లాడారా? మాట్లాడితే ఏం మాట్లాడారు? రాష్ట్రపతి పదవి ఆఫర్‌ చేశారా? లేక కేసులపై భయపెట్టారా? శివసేనపై పవార్‌కు నమ్మకం లేదా? వీటన్నింటికి కాలమే సమాధానం చెప్పాలి.

ఇక ఎన్సీపీ, శరద్‌ పవర్‌ అనూహ్య నిర్ణయంపై శివసేన, కాంగ్రెస్‌ మండిపడుతున్నాయి. రాష్ట్రపతి పదవి కోసం పవార్‌ ఇలా కుటిల రాజకీయాలకు పాల్పడ్డారంటూ ధ్వజమెత్తుతున్నారు. ఇక మాట తప్పిన నేతగా మరాఠా రాజకీయ చరిత్రలో నిలిచిపోతారని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. కిచిడీ పాలన వైపు కాకుండా సుస్థిర పాలన వైపు ఎన్సీపీ ఆసక్తి చూపడంతోనే తమకు మద్దతు ప్రకటించిందని బీజేపీ పేర్కొంది. (చదవండి: ‘మహా’ మలుపు.. రాత్రికి రాత్రి ఏం జరిగింది?)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top