ఎమ్మెల్యేల అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు

Madras High Court Defends 18 MLAs Disqualification - Sakshi

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత కేసులో పళనిస్వామి ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టులో ఊరట లభించింది. 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ విధించిన అనర్హత వేటును మద్రాస్‌ హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 232 మంది సభ్యులు ఉండగా.. తాజా హైకోర్టు తీర్పుతో సభ్యుల సంఖ్య 214కు పడిపోయింది. ప్రస్తుతం పళనిస్వామి ప్రభుత్వానికి 110 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో ప్రభుత్వ మనుగడకు కావాల్సిన మెజారిటీ పళని ప్రభుత్వానికి దక్కినట్టు అయింది. అయితే, ఈ 18 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే.. వాటి ఫలితాల ఆధారంగా సమీకరణాలు మారిపోయే అవకాశముంది. తన మద్దతుదారులైన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు టీటీవీ దినకరన్‌ స్పష్టం చేశారు.

అన్నాడీఎంకే పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించటంతోపాటు.. ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ఉద్దేశంతో గవర్నర్‌ను కలిశారన్న కారణంగా తమిళనాడు స్పీకర్‌ ధన్‌పాల్ గతేడాది 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. అయితే, వీరిపై అనర్హత వేటు కేసులో గతంలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించింది. దీంతో విచారణను మూడో న్యాయమూర్తికి బదలాయించారు. దినకరన్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్‌ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. స్పీకర్‌ నిర్ణయం చెల్లబోదని జస్టిస్‌ సెల్వం తీర్పు వెలువరించారు. దీంతో మూడో న్యాయమూర్తి ఈ కేసును విచారించి.. అనర్హత వేటును సమర్థించడంతో ఎమ్మెల్యేల బహిష్కరణ ఖాయమైంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top