కోట్లున్నా.. పాన్‌కార్డు లేదు!

Madhyapradesh MLAs And MPs Dont Have PAN Card - Sakshi

మధ్యప్రదేశ్‌కు చెందిన  ఎంపీలు, ఎమ్మెల్యేలకు కోట్ల ఆదాయం ఉన్నా కొందరికి పాన్‌ కార్డు కూడా లేదని, మరికొందరు అసలు ఐటీ రిటర్నులు దాఖలు చేయలేదని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) వెల్లడించింది. 16 మంది ఎమ్మెల్యేలకు కోట్ల ఆస్తులున్నాయని, అయితే వారెవరూ ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదని ఏడిఆర్‌ నివేదిక పేర్కొంది. ఎన్నికల అఫిడవిట్‌లో కనీసం పాన్‌ కార్డు వివరాలు కూడా పేర్కొనని ఎమ్మెల్యేల్లో గదర్వార ఎమ్మెల్యే సునీతా పటేల్, సిరోంజి ఎమ్మెల్యే ఉమాకాంత్‌ శర్మ ఉన్నారు. సునీతకు ఆరు కోట్లకు పైగానే ఆస్తులున్నాయి. పాన్‌కార్డు వివరాలిచ్చి ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయని వారిలో బాలఘాట్‌ బీజేపీ ఎంపీ బోధ్‌సింగ్‌ భగత్‌ ఉన్నారు.

ఈయన ఆస్తి రూ.2 కోట్లకు పై మాటే. షహదాల్‌ ఎంపీ జ్జాన్‌సింగ్, రేవా ఎంపీ జనార్దన్‌ మిశ్రా కూడా కోటీశ్వరులైనా ఐటీ రిటర్నులు దాఖలు చేయలేదు. వీరిద్దరూ బీజేపీ ఎంపీలేనని ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. రూ.5 కోట్ల ఆస్తి ఉన్న బర్వానీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్, రూ.3 కోట్లకు పైగా ఆస్తి ఉన్న గుణ ఎమ్మెల్యే గోపీలాల్‌ జాతవ్, రెండు కోట్ల ఆస్తి ఉన్న కోటమ ఎమ్మెల్యే సునీల్‌ కుమార్, మంగోలి ఎమ్మెల్యే బ్రజేంద్ర సింగ్‌కు పాన్‌కార్డులు కూడా లేవు. వీరందరి వివరాలను ఏడీఆర్‌ మధ్యప్రదేశ్‌ ప్రధాన ఆదాయం పన్ను శాఖ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా తెలిపింది. ఈ ఎమ్మెల్యేలు, ఎం పీల్లో కొందరు 2–3 సార్లు ఎన్నికైన వారూ ఉన్నారని, వారి ఆస్తులు ఎన్నో రెట్లు పెరిగాయని అయినా వారు పాన్, ఐటీ రిటర్నుల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొనడం లేదని ఏడీఆర్‌ ఐటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆర్థిక లావాదేవీల గురించి పూర్తిగా చెప్పకపోయినా, తప్పుగా చెప్పినా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టు 2013, సెప్టెంబర్‌ 13న తీర్పు ఇచ్చిందని, దాని ప్రకారం వీరిపై చర్య తీసుకోవాలని ఏడీఆర్‌ కోరింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top