ఆ 22 మందికి నోటీసులు

Madhya Pradesh Speaker issues notices to 22 rebel MLAs - Sakshi

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చిన స్పీకర్‌

భోపాల్‌/న్యూఢిల్లీ/బెంగళూరు: మధ్యప్రదేశ్‌ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్‌ ఎన్‌పీ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం కల్లా తన ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. స్వచ్ఛందంగానా లేక.. ఎవరి ఒత్తిడితోనైనా రాజీనామా చేశారా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని వారిని కోరారు. ఆ తర్వాతే సభలో బల పరీక్ష చేపడతామని స్పీకర్‌ తెలిపారు. బల నిరూపణకు సిద్ధమని సీఎం కమల్‌నాథ్‌ ఇంతకుముందే తెలిపారని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

అయితే, పార్టీని వీడిన ఆరుగురు మంత్రులు సహా 22 మంది సభ్యుల రాజీనామాల విషయం తేలాకే బలపరీక్ష ఉంటుందన్నారు. రాజీనామాలు చేసిన వారంతా స్పీకర్‌ను ఎందుకు కలుసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభానికి బీజేపీయే కారణమన్నారు. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో భోపాల్‌ చేరుకున్న జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ కార్యకర్తలు, సింధియా అనుచరులు ఘనస్వాగతం పలికారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోకి ఆయన్ను మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా సింధియా మీడియాతో మాట్లాడుతూ..బీజేపీలోకి చేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని, పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తానని  కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

బెంగళూరులో హైడ్రామా
బెంగళూరు పోలీసులు తమ మంత్రులను ఇద్దరిని అరెస్టు చేశారని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. కాంగ్రెస్‌ ఎంపీ, న్యాయవాది అయిన వివేక్‌ తంఖా మాట్లాడుతూ.. ‘బెంగళూరు రిసార్టులో ఉన్న ఎమ్మెల్యే మనోజ్‌ చౌదరితో మాట్లాడేందుకు ఆయన తండ్రితో కలిసి మంత్రులు జితు పట్వారీ, లఖన్‌ సింగ్‌ వెళ్లారు. బెంగళూరు పోలీసులు వారిని రిసార్టులోపలికి వెళ్లనివ్వలేదు. వారిపై దాడి చేసి, అరెస్టు చేశారు. మనోజ్‌ తన తండ్రితో కలిసి భోపాల్‌ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, రానివ్వడం లేదు. దీనిపై మేం సుప్రీంకోర్టుకు వెళతాం’ అని ఆయన వెల్లడించారు. కాగా, పట్వారీ అక్కడి పోలీసులతో వాదులాడుతున్నట్లుగా ఉన్న వీడియో వైరల్‌ అవుతోంది. రాజీనామా చేసిన 22 మందిలో 19 మంది బెంగళూరులోనూ మిగతా వారు మధ్యప్రదేశ్‌లోనూ ఉన్నట్లు సమాచారం.

బల పరీక్షకు బీజేపీ డిమాండ్‌
ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో అసెంబ్లీలో సర్కారు బలం నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. మధ్యప్రదేశ్‌ బీజేపీ చీఫ్‌ విప్‌ నరోత్తమ్‌ మిశ్రా గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అందుకే, బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న ఈ నెల 16వ తేదీన సభలో బల నిరూపణ జరపాలని స్పీకర్‌ను, గవర్నర్‌ను కోరతాం’ అని పేర్కొన్నారు.

ఆయన భవిష్యత్తు గురించి భయపడ్డారు: రాహుల్‌
తన రాజకీయ భవిష్యత్తు గురించి భయపడుతున్నందునే సింధియా నమ్ముకున్న సిద్ధాంతాలను మర్చిపోయారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.  ‘ఆయన బయటకు చెప్పే దానికి వాస్తవ కారణాలకు చాలా తేడా ఉంది. ఆయన నా చిరకాల మిత్రుడు. కాలేజీ రోజుల నుంచి ఆయన నాకు బాగా తెలుసు. తన రాజకీయ భవిష్యత్తు గురించిన భయం వల్లే సిద్ధాంతాలను పక్కనబెట్టి ఆర్‌ఎస్‌ఎస్‌(బీజేపీ)లోకి వెళ్లారు. అయితే, ఆయనకు అక్కడ గౌరవం లభించదు. ఆ పార్టీలో ఆయన సంతృప్తికరంగా ఉండలేరు’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top