లైన్‌ క్లియర్‌?

line Clear For TDP And Congress Telangana Election alliance - Sakshi

కాంగ్రెస్‌..టీడీపీ మధ్య సయోధ్య 

స్థానాలతో పాటు అభ్యర్థులూ ఖరారు 

కాంగ్రెస్‌లోనూ సీనియర్లకు పచ్చజెండా 

ఢిల్లీలో చక్రం తిప్పుతున్న తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య

ఉప్పల్‌ టీఆర్‌ఎస్‌లో హైడ్రామా.. అభ్యర్థికి వ్యతిరేకంగా నిరసనలు 

సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య ముందస్తు ఎన్నికల పొత్తు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఈ మేరకు  స్థానాలు దాదాపు ఖరారయ్యాయి. తెలుగుదేశం పార్టీ కోరుతున్న స్థానాలు నగరంలోనే అధికంగా ఉండటంతో భారీ కసరత్తు అనంతరం తుది జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి కూకట్‌పల్లి, ఉప్పల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట స్థానాల్లో ఏవైనా నాలుగు లేదా ఐదు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో తెలుగుదేశం పార్టీ సైతం కూకట్‌పల్లి నుంచి పార్టీ ముఖ్య నేత పెద్దిరెడ్డి, ఉప్పల్‌లో వీరేందర్‌గౌడ్, మల్కాజిగిరిలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వచ్చే ఓ ముఖ్య నాయకునికి, సనత్‌నగర్‌ స్థానాన్ని ఆశిస్తున్న కూన వెంకటేష్‌గౌడ్‌కు, ఖైరతాబాద్‌ లంకల దీపక్‌రెడ్డి అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారు చేసినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఎంపికపై కొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నారు.

కాంగ్రెస్‌లోనూ గ్రీన్‌ స్నిగల్‌ 
అభ్యర్థులను అధికారికంగా ప్రకటించని కాంగ్రెస్‌...కొందరు అభ్యర్థులకు మాత్రం ప్రచారం చేసుకోండంటూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. దీంతో గోషామహల్‌లో ముఖేష్‌గౌడ్, సనత్‌నగర్‌లో మర్రి శశిధర్‌రెడ్డి, ఎల్బీనగర్‌లో దేవిరెడ్ది సుధీర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్‌లో కూన శ్రీశైలంగౌడ్‌Š, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డికి టికెట్లు ఖాయమని, ఈ స్థానాల్లో అభ్యర్థులు ఖరారైనట్లేనని పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఐతే

తెలుగుదేశం పార్టీకి పొత్తులో 
కేవలం నాలుగు స్థానాలే ఇవ్వాలని, అంతకు మించితే పార్టీకి ఇబ్బందవుతుందని గ్రేటర్‌ నాయకులు పార్టీ దృష్టికి తీసుకువెళుతున్నారు. ఆయా స్థానాల్లో తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలంటూ మల్కాజిగిరికి చెందిన ఆకుల రాజేందర్, నంది కంటి శ్రీధర్, బండా కార్తీకరెడ్డి, ఆదం సంతోష్‌కుమార్, పల్లె లక్ష్మణరావు, అనిల్‌కుమార్‌యాదవ్, డాక్టర్‌ వినయ్‌కుమార్‌లు కోరుతున్నట్లు తెలుస్తోంది.  

ఢిల్లీలో ఆర్‌.కృష్ణయ్య.. 
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఎల్బీనగర్‌ తాజా మాజీ ఎమ్మెల్యే  ఆర్‌.కృష్ణయ్య తన రాజకీయ భవిష్యత్‌ను ఢిల్లీలో తేల్చుకునే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చారని తెలిసింది. అందులో భాగంగా తమ డిమాండ్లకు అనుగుణంగా కలిసివచ్చే పార్టీతో ముందుకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.  

ఉప్పల్‌ టీఆర్‌ఎస్‌లో హై డ్రామా 
ఉప్పల్‌: ఉప్పల్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో హైడ్రామా నెలకొంది. పార్టీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించినప్పటికీ అసమ్మతి రాగం రోజురోజుకు పెరుగుతోంది. అభ్యర్థికి అనుకూల, ప్రతికూల వర్గాలు బాహాటంగా పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తుండటంతో పార్టీ శ్రేణులలో అయోమయం నెలకొంది. కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు ఎటు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు. 

దీంతో టీఆర్‌ఎస్‌లో రాజకీయ పరిణామాలు  రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. పార్టీ అభ్యర్థిగా భేతి సుభాష్‌రెడ్డిని ప్రకటించడంపై అసమ్మతి రాగం రోజుకో మలుపు తిరుగుతోంది. అభ్యర్థి సుభాష్‌రెడ్డి ఓ పక్క అనుచరులతో ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. పార్టీకి చెందిన మెజార్టీ కార్పొరేటర్లు అభ్యర్థితో కలిసి ప్రచారంలో రాకపోగా తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉప్పల్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ అనుచరులు, వార్డు కమిటీ, ఏరియా కమిటీ సభ్యులు తదితరులు మూకుమ్మడిగా కార్పొరేటర్‌ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ ర్యాలీగా వెళ్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భేతి సుభాష్‌రెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top