
సాక్షి, జమ్మలమడుగు: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మించిన ఊరు..అందుకే జమ్మలమడుగంటే ఆయనకు అంత అభిమానం.. తాను సీఎం అయిన తరువాత జమ్మలమడుగు అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు. అందుకే ఆ నియోజకవర్గ ప్రజలు కూడా వైఎస్సార్ అన్నా.. ఆయన కుటుంబమన్నా అంత అభిమానం చూపిస్తారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేస్తున్న డాక్టర్ మూలే సుధీర్‌ను అసెంబ్లీకి పంపి మహానేత కుటుంబంపై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి పుట్టింది కడప జిల్లా జమ్మలమడుగులోని క్యాంబెల్ ఆసుపత్రిలో... అందుకే ఆయన వైద్య వృత్తిని పూర్తి చేసుకున్న అనంతరం ఏడాది పాటు ఇదే ఆసుపత్రిలో వైద్యసేవలను అందించారు. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తనదైన శైలిలో వివిధ కార్యక్రమాలు ప్రారంభించి ప్రజా మన్నన పొందారు. మండల పరిధిలోని గూడెంచెరువు సమీపంలో దాదాపు 2వేల మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మించి తానే స్వయంగా ప్రారంభించారు. కరువుజిల్లాగా ఉన్న రాయలసీమ ప్రాంతాన్ని గాలేరు–నగరి ప్రాజెక్టు అంతర్భాగమైన గండికోట ప్రాజెక్టును నిర్మించి జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలగుండెల్లో శాశ్వత ముద్ర వేసుకున్నారు.
టీడీపీ ఆవిర్భావం తరువాత..
1983లో మొదటి సారిగా టీడీపీ తరపున జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పి.శివారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన టి.నరసింహారెడ్డిపై 12,894 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1985, 1989లో శివారెడ్డి టీడీపీ తరపున పొటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు.ఆయన వారసుడిగా పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి టీడీపీ తరఫున 1994, 1999లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సి.నారాయణరెడ్డిపై గెలుపొందారు. అయితే 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సి. ఆదినారాయణరెడ్డి టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై 22వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో పులివెందులతోపాటు, జమ్మలమడుగు నియోజకవర్గాన్ని తనదైన శైలిలో అభివృద్ధివైపు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున ఆదినారాయణరెడ్డి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందిన ఆదినారాయణరెడ్డి 2016లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎర్రగుంట్లకు చెందిన డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
సౌమ్యుడు సుధీర్ రెడ్డివైపే ఓటర్ల చూపు..
నాలుగు దశాబ్దాలుగా ఫ్యాక్షన్ రాజకీయాలను చూసిన నియోజకవర్గ ప్రజలు కొత్తవాడైన డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి వైపు మొగ్గుచూపుతున్నారు. ఎప్పుడూ బద్ధ శత్రువులుగా ఉండే పొన్నపురెడ్డి కుటుంబం, దేవగుడి కుటుంబాలు ఇపుడు ప్రచారంలో కలిసి తిరుగుతున్నా సరైన స్పందన కనిపించడంలేదని టీడీపీకి చెందిన నాయకులే పేర్కొంటున్నారు. కొత్తగా వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మూలే సుధీర్‌రెడ్డికే ప్రజలనుంచి మంచి స్పందన వస్తోంది. ఇంత కాలం టీడీపీ నేతలు పనులు పంచుకుంటూ ప్రజల గురించి పట్టించుకోకపోవడంతో నియోజకవర్గ వాసులు వైఎస్‌కుటుంబంపై ఉన్న అభిమానంతో డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి వైపు చూస్తున్నారు.
స్థానికులను పట్టించుకోని రామసుబ్బారెడ్డి
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డి కార్యకర్తలను, స్థానిక నాయకులను పట్టించుకోపోవడంతో కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. దేవగుడి కుటుంబంతో కలిసి పనిచేయడంతో చాలా గ్రామాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గం చాలా వరకు రామసుబ్బారెడ్డికి మద్దతూ ఇవ్వకపోవచ్చు అనే వాదన ప్రజల్లో బలంగా ఉంది.
ఓటర్ల వివరాలు
మొత్తం 2,23,913
పురుషులు 1,10,000
మహిళలు 1,13,893
ఇతరులు: 20