ముగ్గురు ‘కూన’లు మూడు పార్టీలు

Kuna Family members In Different Parties - Sakshi

కుత్బుల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వివేకానంద్‌

సనత్‌నగర్‌ బరిలో టీడీపీ నుంచి వెంకటేష్‌గౌడ్‌

కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్‌ తరఫున శ్రీశైలంగౌడ్‌

కుత్బుల్లాపూర్‌ నుంచి శ్రీశైలంగౌడ్, వివేకానంద్‌ పోటీ  వీరిద్దరూ వరుసకు బాబాయ్, అబ్బాయ్‌లు..ఒకరు కాంగ్రెస్‌ నుంచి.. మరొకరు టీఆర్‌ఎస్‌ నుంచిసనత్‌నగర్‌లో టీడీపీ  అభ్యర్థిగా కూన వెంకటేశ్‌గౌడ్‌    ముగ్గురు అభ్యర్థులూ కూన వంశానికి చెందినవారే..   ఆ రెండు స్థానాల్లో గెలుపోటములపై ఆసక్తికర చర్చ    

కుత్బుల్లాపూర్‌: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని రెండు స్థానాల్లో విచిత్రమైన పోటీ నెలకొంది. ఒకరు టీడీపీ.. మరొకరు కాంగ్రెస్‌.. ఇంకొకరు టీఆర్‌ఎస్‌.. ఇలా పార్టీలు వేరైనా బ్రాండ్‌ మాత్రం ఒకటే.. వీరెవరో కాదు సుమా.. కుత్బుల్లాపూర్‌కు చెందిన ముగ్గురు ‘కూన’ వంశస్తులు. తాజా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న కూన వివేకానంద్‌కు టీఆర్‌ఎస్‌ నుంచి ఆ పార్టీ అ«ధినేత కేసీఆర్‌ మొదటి జాబితాలోనే టికెట్‌ ఖరారు చేయగా, కాంగ్రెస్‌ జాబితాలో సైతం మహా కూటమి తరపున కూన శ్రీశైలం గౌడ్‌కు టికెట్‌ దక్కింది. ఈ నేపథ్యంలోనే సనత్‌నగర్‌ టికెట్‌ విషయంలో మహాకూటమి అభ్యర్థి ఎంపిక అటు టీడీపీ.. ఇటు కాంగ్రెస్‌ పార్టీలకు పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టింది. ఎట్టకేలకు తుది జాబితాలో కూన వెంకటేశ్‌గౌడ్‌ను టికెట్‌ వరించింది.

నగరంలో మొత్తం 23 నియోజకవర్గాలు ఉండగా మూడు పార్టీల నుంచి ఒకే సామాజిక వర్గానికి చెంది.. ఒకే ఇంటిపేరున్న ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండడం చర్చనీయాంశమైంది. గాజులరామారం గ్రామంలో కూన వెంకటేశ్‌గౌడ్, కూన శ్రీశైలంగౌడ్‌లు జన్మించగా, కుత్బుల్లాపూర్‌లో కూన వివేకానంద్‌ జన్మించారు. వీరంతా ఒకే నియోజకవర్గానికి సంబంధించిన వారు కావడం, అందరూ రక్త సంబంధీకులే కావడం యాదృచ్ఛికమే. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కుత్బుల్లాపూర్‌ నుంచి కూన శ్రీశైలం గౌడ్, కూన వివేకానంద్‌ (బాబాయ్, అబ్బాయ్‌)లు పోటీ పడుతుండగా, సనత్‌నగర్‌ నుంచి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై కూన వెంకటేశ్‌గౌడ్‌ పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురి గెలుపోటములపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీరిలో ఏ ఇద్దరు అసెంబ్లీలో అడుగు పెడతారన్నదే హాట్‌ టాపిక్‌గా మారింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top