సూపర్‌ ఛాన్స్‌.. ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు: కేటీఆర్‌

KTR Fires On Congress Leaders And Mahakutami - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలను కొట్టే మంచి అవకాశం తెలంగాణ ప్రజలకు వచ్చిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఓటుతో మహాకూటమిగా జతకట్టిన కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఎం పార్టీలకు బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం విస్తృత సమావేశానికి కేటీఆర్‌, ఎంపీ బాల్కసుమన్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు వీర సైనికుల్లా పనిచేశారన్నారు. ఆ సమయంలో ఇంట్లో పడుకున్న కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఇంట్లో పడుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పుడేమో సైనికుడునని మాట్లాడుతున్నారు. ఇది రాహుల్‌ గాంధీకి తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరగుతున్న పోటీ అని తెలిపారు. తెలంగాణకు జై అన్నారు కాబట్టే గతంలో టీఆర్‌ఎస్‌ టీడీపీ, కాంగ్రెస్‌లతో పొత్తుపెట్టుకుందని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమకారులను హతమార్చిన కాంగ్రెస్‌, టీడీపీలతో కోదండరాం పొత్తుపెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెట్టడానికి కాంగ్రెసోళ్లు సిద్దమయ్యారన్నారు. కాంగ్రెసోళ్లు పెళ్లి కాని యువకులకు పెళ్లి కూడా చేస్తామని, అవసరమైతే వారికి తిండి కూడా తినిపిస్తామని, వారి పిల్లల డైపర్స్‌ కూడా మారుస్తామని హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో పెట్టిన మ్యానిఫేస్టోలో ఏం అమలు చేశారో  చెప్పాలన్నారు.

రాజధాని పేరిట వేల కోట్ల స్కామ్స్‌..
తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచి విద్యార్థులే ఉన్నారని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ అన్నారు. ఓటుకు కోట్లలో దొరికిన నేతలు, కార్లలో కరెన్సీ కట్టలు దొరికిన నేతలు కూడా కేసీఆర్‌ మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణ మీద దోపిడీ కోసం దండయాత్రకు దిగుతున్నారు. ఏపీలో ఐటీ సోదాలు జరిగితే టీడీపీ నేతలు భయపడుతున్నారని, రాజధాని పేరిట వేల కోట్లు స్కామ్స్‌ చేశారని అందుకే భయపడుతున్నారని తెలిపారు. అలాంటి వాళ్లు మళ్లీ తెలంగాణను దోచుకోవడానికి సిద్దమవుతున్నారు. కాంగ్రెస్‌, టీడీపీకి ఒకే ఓటుతో బుద్ది చెప్పాలన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top