జూన్‌లో సీఎంగా రాబోతున్నారా?

KTR Answers To Journalist Questions - Sakshi

కేటీఆర్‌ను ప్రశ్నించిన విలేకరి

అలాంటిదేమి లేదన్న కేటీఆర్‌

కేసీఆర్‌ సీఎంగా కొనసాగుతారని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) హైదరాబాద్‌ నుంచే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారని ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్‌) స్పష్టం చేశారు. తెలంగాణ సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తారని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన కేటీఆర్‌ శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్‌’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్న నేపథ్యంలో మే లేదా జూన్‌లో మీట్‌ ది ప్రెస్‌కు ముఖ్యమంత్రిగా ఏమైనా కేటీఆర్‌ రాబోతున్నారా అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని కొట్టిపారేశారు. ‘జాతీయ రాజకీయాలంటే ఢిల్లీలోనే కూర్చుని చేయాలని లేదు. అలా అని రూల్‌ ఎక్కడా లేదు, రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదు. జాతీయ రాజకీయాలను హైదరాబాద్‌ నుంచి శాసించొచ్చు. తెలంగాణ సీఎంగా ఉంటూ కూడా జాతీయ రాజకీయాల్లో మన ముద్ర వేయొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్‌ ఆనాడు దేశ రాజకీయాలను కూడా శాసించారు. తెలంగాణ రాష్ట్రానికి మరో పది, పదిహేనేళ్లు కచ్చితంగా కేసీఆర్‌ నాయకత్వం అవసరముంది. నాతోపాటు, లక్షలాది మంది కార్యకర్తలు బలంగా ఇదే కోరుకుంటున్నారు. పార్టీ కార్యనిర్వహక అధ్యక్ష పదవి నాకు ఇచ్చారని, మరేదో పెద్ద పదవి నాకు ఇస్తారని ఊహించి రాసి ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు. హైదరాబాద్‌లో సీఎంగానే ఉంటూనే మన పాత్ర పోషించవచ్చు. గతంలో పెద్దవాళ్లు చేశారు. ఇప్పుడు కూడా చేసే అవకాశముంద’ని కేసీఆర్‌ వివరణయిచ్చారు. సీఎం పోస్టు మరో పది, పదిహేనేళ్లు ఖాళీగా లేదన్నారు. తన సోదరి, నిజామాబాద్‌ ఎంపీ కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top