టీఆర్‌ఎస్‌కు రత్నం గుడ్‌బై

KS Ratnam quits TRS - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: టీఆర్‌ఎస్‌కు జిల్లాలో గట్టి షాక్‌ తగిలింది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌.రత్నం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ టికెట్‌ను ఆశించి భంగపడ్డ ఆయన బుధవారం చేవెళ్లలో తన అనుచరులతో భేటీ అయి.. భవిష్యత్‌ కార్యాచరణ వెల్లడించారు. 2014 ఎన్నికల్లో తనపై గెలుపొం దిన కాంగ్రెస్‌ అభ్యర్థి కాలె యాదయ్యను పార్టీలో చేర్చుకోవడమే గాక పార్టీ టికెట్‌ను అతనికే ఖరారు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రత్నం వారం రోజులుగా సన్నిహితులతో మంతనాలు జరిపారు. అవమానం జరిగిన పార్టీలో ఉండటంకన్నా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవడమే మేలని కార్యకర్తలు స్పష్టం చేశారు. టికెట్లను ప్రకటించిన అనంతరం అధిష్టానం నుంచి పిలుపు వస్తుందని భావించినా ఎలాంటి స్పందనా లేకపోవడంతో అనివార్యం గా పార్టీని వీడాలని రత్నం నిర్ణయించారు.

కాంగ్రెస్‌ గూటికి!
గులాబీకి గుడ్‌బై చెప్పిన రత్నం.. కాంగ్రెస్‌ గూటికి చేరాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ దిశగా ఆ పార్టీ అధిష్టానంతో అంతర్గతంగా సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా రత్నం చేరికకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరే అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top