కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొండా దంపతులు

Konda surekha Joins Congress Party - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలు కొండా సురేఖ, మురళీ దంపతులు బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్‌ఎస్‌లో తమకు టికెట్‌ కేటాయించలేదని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా ధ్వజమెత్తిన కొండా దంపతులు.. కాంగ్రెస్‌ గూటికి చేరనున్నట్టు మంగళవారమే సంకేతాలు ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ కుటుంబంపై తీవ్ర  విమర్శలు చేసిన తర్వాత సాయంత్రానికి వారిద్దరూ ఢిల్లీ చేరుకున్నారు. దీంతో వారు కారు దిగి హస్తం గూటికి చేరబోతున్నట్టు స్పష్టమైంది.

బుధవారం ఉదయం 10 గంటల సమయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది. తమకు కేటాయించాల్సిన సీట్లపై పూర్తి స్థాయిలో హామీ తీసుకున్న అనంతరమే వారు పార్టీలో చేరినట్టు సమాచారం. కొండా దంపతులు కాంగ్రెస్‌లోకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండమంటూ కేటీఆర్‌కు సవాల్‌ విసిరిన వీరు.. కాంగ్రెస్‌ గూటికి చేరడాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సైతం స్వాగతిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top