మూడు జిల్లా పరిషత్‌లు మావే..

Komatireddy venkat reddy Says Congress Will Win Three ZP Seats In Nalgonda - Sakshi

అధిష్టానం ఆదేశిస్తే నార్కట్‌పల్లి స్థానంలో మా కుటుంబం నుంచి ఒకరిని బరిలోకి దించుతాం

మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ : త్వరలో జరగనున్న జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడు జిల్లా పరిషత్‌ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీతోపాటు ఆ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. అక్టోబర్‌నుంచి రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ప్రజా సమస్యలను పట్టించుకునే పాలకులే లేకుండా పోయారని ఆరోపించారు. ముఖ్యమంత్రి దోచుకున్న డబ్బుతో ఎన్నికల్లో వారి అభ్యర్థులపై ఖర్చు చేసి గెలిపించుకోవాలనే చూస్తున్నారే తప్ప ప్రజలను, పాలనను  పట్టించుకోవడంలేదన్నారు.  ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ నేతలు ఓటర్లను మభ్యపెట్టారన్నారు. బ్యాంకు అధ్యక్షుడు, భూ కబ్జాదారు అయినటువంటి వ్యక్తికి ఎంపీ టికెట్‌ ఇచ్చారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించారన్నారు. జిల్లాల్లో రెండు పార్లమెంట్‌ స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక లేకుండా చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన ఏర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన కావాలంటే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే సాధ్యమన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు జిల్లా పరిషత్‌ స్థానాలను కైవసం చేసుకోవాలంటే అత్యధిక జెడ్పీటీసీ సభ్యుల స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 
అధిష్టానం ఆదేశిస్తే నార్కట్‌పల్లి నుంచి మా కుటుంబ సభ్యులనుబరిలోకి దించుతాం..
కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నార్కట్‌పల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిని బరిలోకి దించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. అయితే పార్టీ ఆదేశానుసారం పోటీలో ఉండే విషయం త్వరలోనే వెల్లడిస్తామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రభుత్వం లేదు
రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని, దానికి ఇంటర్‌ బోర్డు ఫలితాలే నిదర్శనమని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఇంటర్‌ బోర్డు చేసిన తప్పిదాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. వీళ్లు చేసిన నిర్వాకానికి ప్రభుత్వ పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులకు, రాష్ట్ర ప్రజలకు  క్షమాపణ చెప్పాలన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మం త్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లక్షలాదిమంది భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదా అని నిలదీశారు. కారు, సారు, పదహారు అంటూ 16మంది ఎంపీలను డబ్బులు పెట్టిగెలిపించుకునేందుకు చూశారని, ఇప్పుడేమో అన్ని జిల్లాపరిషత్‌లు తమవే అంటున్నారని, పాలన మాత్రం జరగడం లేదని దుయ్యబట్టారు. రెవెన్యూలో కొత్త చట్టం తెస్తామంటున్నారని, మొదట ఆ శాఖ అధికారులు బాగా చేస్తున్నారని మెచ్చుకున్న సీఎం కేసీఆర్‌ నేడేమో ప్రక్షాళన అంటూ వాళ్లను దొంగలను చేస్తున్నారని, రెవెన్యూ మంత్రిత్వ శాఖ తన వద్దే ఉంచుకొని అలా మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top