కోదండరాంకు లైన్‌క్లియర్‌! | Sakshi
Sakshi News home page

కోదండరాంకు లైన్‌క్లియర్‌!

Published Fri, Nov 16 2018 4:44 AM

Kodandaram to Contest from Jangaon - Sakshi

సాక్షి, జనగామ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న జనగామ స్థానం నుంచి పోటీ చేయడానికి తెలంగాణ జనసమితి(టీజేఎస్‌) అధినేత ప్రొఫెసర్‌ కోదండరాంకు లైన్‌క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా జనగామ టీజేఎస్‌కు కేటాయించే అవకాశాలు  ఖాయమైనట్లుగా తెలుస్తున్నాయి.   

సిద్ధమైన ప్రచార రథాలు
కాంగ్రెస్‌ ఇప్పటి వరకు మూడు జాబితాలను విడుదల చేసినా జనగామ నుంచి టికెట్‌ ఆశిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే జనగామతోపాటు 11 స్థానాల్లో పోటీ చేస్తా మని టీజేఎస్‌ ప్రకటించింది. టీజేఎస్‌ వ్యవహార తీరుపై పొన్నాలతోపాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రెండు పార్టీల్లోనూ జనగామ సీటు పీటముడి వీడటం లేదు.  దాదాపుగా జనగామ టీజేఎస్‌కే కేటాయించే అవకాశం ఉండటంతో ప్రచారానికి ఆ పార్టీ సిద్ధం అవుతోంది.  ఎనిమిది ప్రచార రథాలను సిద్ధం చేశారు.  శుక్రవారం నియోజకవర్గంలో తిప్పడానికి పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ ప్రచార రథాలపై జనగామ అభ్యర్థి కోదండరాం అని రాయడం గమనార్హం. 

జనగామ జిల్లా కేంద్రంలో టీజేఎస్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎన్నికలు అయిపోయే వరకు కోదండరాం ఇక్కడే నివా సం ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.  కోదండరాం సమీప బంధువులు జనగామలోనే మకాం వేసి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లతోపాటు గుర్తింపు పొందిన ప్రముఖులను కలసి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడిన ఇద్దరు బలమైన నేతలు కోదండరాం కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ నెల 19న కోదండరాం నామినేషన్‌ వేసే అవకాశాలు ఉన్నాయి. ముం దుగా 17న కోదండరాం తరుపున పార్టీ నేతలు మొదటి నామినేషన్‌ వేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

కార్యకర్తల మూకుమ్మడి రాజీనామా
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు జనగామ అసెంబ్లీ టికెట్‌ కేటాయింపులో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న తీరుతో ఆ పార్టీ కార్యకర్తలు, పొన్నాల అనుచరులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 13 మంది కౌన్సిలర్లతోపాటు 28, 500 మంది క్రియాశీలక కార్యకర్తలు మూకు మ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు లేఖ రాశారు. కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు.
 

Advertisement
Advertisement