
టాలీవుడ్ బుల్లితెర నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు జైలుశిక్ష పడింది. గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి మృతికి కారణమైన లోబోకు ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పునిచ్చింది. బుల్లితెరపై సినీ ప్రియులను అలరించిన లోబో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఓ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2018 మే 21న ఓ టీవీ ఛానల్ ప్రోగ్రామ్ చిత్రీకరణ కోసం లోబో బృందం వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై 2018లో జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో జనగామ కోర్ట్ తీర్పు వెల్లడించింది. ఇద్దరి మృతికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని పోలీసులు తెలిపారు.
లోబో కెరీర్ విషయానికొస్తే హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ అనే మ్యూజిక్ షోతో బాగా పాపులర్ అయ్యాడు లోబో. తనకు అందరిలా ఉండటం నచ్చదు. సమ్‌థింగ్ స్పెషల్ అంటూ వెరైటీ జుట్టుతో, డిఫరెంట్ డ్రెస్సుతో, వినూత్న గెటప్‌తో, హైదరాబాదీ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత స్క్రీన్ మీద పెద్దగా కనిపించని లోబో బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్-5లో కంటెస్టెంట్గా బుల్లితెర ఆడియన్స్‌ను అలరించాడు.