‘కవిత బతుకమ్మ చీర కడుతుందా..?’

Khushboo Asks Is Kavita Wear The Bathukamma Saree In Adilabad Road Show - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : డబుల్‌ బెడ్రూం పేరిట ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌ తన కోసం మాత్రం బుల్లెట్‌ ప్రూఫ్‌ ఇళ్లు కట్టుకున్నారంటూ కాంగ్రెస్‌ నేత, సిని నటి ఖుష్బు ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన రోడ్‌ షోలో ఖుష్బు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ మండి పడ్డారు. బతుకమ్మ చీరల పేరిట వందల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలకు నాసిరకం బతుకమ్మ చీరలు పంచారని విమర్శించారు. పేదలకు పంచిన బతుకమ్మ చీరలను కేసీఆర్‌ కూతురు కవిత కట్టుకుంటుందా అంటూ ఖుష్బు ప్రశ్నించారు.

కేసీఆర్‌ పేదలందరికి డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానంటూ ప్రజలను మోసం చేశారన్నారు. కానీ ఆయన కోసం మాత్రం రూ. 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి బుల్లెట్‌ ప్రూఫ్‌ ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు. ప్రజలు తనను ప్రశ్నించి, దాడులకు పాల్పడతారనే భయంతోనే కేసీఆర్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ ఇంటిలో దాక్కున్నారని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఖుష్బు కోరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మహిళల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని.. ప్రతి సంఘానికి రూ. 10 లక్షలు వడ్డిలేని రుణం ఇస్తామని తెలిపారు. మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ తోడుదొంగలే అని.. రాష్ట్రంలో పాలన సాత్‌ చోర్‌ అనే విధంగా సాగించారంటూ ఖుష్బు విమర్శించారు.

జోగురామన్న దొంగలతో జత కట్టారు : గద్దర్‌
ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ తిరిగిన జోగురామన్న చివరకూ దొంగలతో జత కట్టారంటూ ప్రజా యుద్ధనౌక గద్దర్‌ ఆరోపించారు. ఉద్యమకారులు, విద్యార్థుల వల్ల అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ఆ తర్వాత వారిని ఏ మాత్ర పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా శక్తి ఏంటో కేసీఆర్‌కు ఓటు రూపంలో రుచి చూపండంటూ ప్రజలను కోరారు. ఆడపడుచు సుజాతను గెలిపించండంటూ విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top