సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి కేరళ ఝలక్‌!

Kerala Tourism Trolls Yogi Adityanath Government

తిరువనంతపురం: తాజ్‌మహల్‌పై ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్‌మహల్‌ భారతీయ సంస్కృతిపై మచ్చ అంటూ ఆయన అభివర్ణించడం పెద్ద దుమారమే రేపింది. దీంతో యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని యూపీ సర్కారు ఈ వివాదానికి దూరం జరిగింది. తాజ్‌మహల్‌ గొప్పదనాన్ని గుర్తిస్తున్నామని ప్రకటించింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా త్వరలోనే తాజ్‌మహల్‌ను సందర్శించనున్నట్టు యోగి ఆదిత్యనాథ్‌ సంకేతాలు ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం చారిత్రక వారసత్వాన్ని మరువరాదంటూ సదరు బీజేపీ ఎమ్మెల్యేకు చీవాట్లు పెట్టారు.

ఈ వివాదం బీజేపీని కుదుపుతున్న నేపథ్యంలో తాజాగా వామపక్ష సర్కారు హయాంలో ఉన్న కేరళ టూరిజం శాఖ పెట్టిన ఓ ట్వీట్‌ అందరి దృష్టి ఆకట్టుకుంటోంది. 'దేవుడి సొంత నేల (కేరళ) తాజ్‌మహాల్‌కు సెల్యూట్‌ చేస్తోంది. లక్షలాదిమంది భారత్‌ను సందర్శించడానికి తాజ్‌మహల్‌ ఒక కారణం.. ఇంక్రెడిబుల్‌ ఇండియా' అంటూ కేరళ టూరిజం శాఖ తాజాగా ట్వీట్‌ చేసింది. తాజ్‌మహల్‌ వివాదంలో యోగి సర్కారును పరోక్షంగా దెప్పిపొడిచేందుకే కేరళ టూరిజం శాఖ ఈమేరకు ట్వీట్‌ చేసినట్టు భావిస్తున్నారు.

భారత్‌లో అత్యంత ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరొందిన తాజ్‌మహల్‌.. ఇటీవల యూపీ సర్కారు విడుదల చేసిన దర్శనీయ ప్రదేశాల బుక్‌లెట్‌లో లేకపోవడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. ఈ నేపథ్యంలో హిందూత్వ అతివాద బీజేపీ నేతలైన సంగీత్‌ సోమ్‌, వినయ్‌ కటియార్‌ తదితరులు తాజ్‌మహల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరకాటంలో పడిన బీజేపీ పరోక్షంగా ఆ ఇద్దరిని మందలిస్తూ దిద్దుబాటు చర్యలకు దిగింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top