కేసీఆర్‌, కేటీఆర్‌ తోడుదొంగలు | Kcr, Ktr are accompanied thieves | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌, కేటీఆర్‌ తోడుదొంగలు

Mar 2 2018 10:16 AM | Updated on Aug 30 2018 5:27 PM

Kcr, Ktr are accompanied thieves - Sakshi

మిర్యాలగూడ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతోన్న కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

మిర్యాలగూడ : ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌లు అధికారం పోతుందనే భయంతో మితిమీరి మాట్లాడుతున్నారని, వారు రాష్ట్రాన్ని దోచుకుంటున్న దోపిడీ దొంగలుగా సీఎల్‌పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభివర్ణించారు. గురువారం మిర్యాలగూడలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన బస్సుయాత్రను జానా దొంగల బండిగా వర్ణించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశ ప్రధానిని, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని నోటికొచ్చిన పదజాలంతో విమర్శిస్తే, కేటీఆర్‌ జానారెడ్డిని కాంగ్రెస్‌ నాయకులను విమర్శించడం తగదన్నారు.

కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవితలు తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 10 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ప్రాజెక్టులతో పాటు మిషన్‌ భగీరథ పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగించి 10 శాతం కమీషన్లు తీసుకున్నారని అన్నారు. దోచుకున్న సొమ్ముతో బెంగుళూరు, హైదరాబాద్‌లలో ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. 500 కోట్ల రూపాయలతో పూర్తి చేసే ఫైబర్‌ కేబుల్‌ వైరుకు కేటీఆర్‌ బా వమరిది పేరుతో కాంట్రాక్టు ఇప్పించి రూ. ఐదు వే ల కోట్లు దోచుకున్నారని పేర్కొన్నారు.

భూముల కుంభకోణంపై ఆధారాలతో సహా బయటపెడుతాం
హైదరాబాద్‌లో జరిగిన జిడీమెట్ల, మియాపూర్‌ భూముల కుంభకోణాలను రాబోయే అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెడతానని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి అధికారం పోగానే కేసీఆర్, కేటీఆర్‌లు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కేటీఆర్‌ ఒక బ్రోకర్‌లా మాట్లాడుతున్నాడని, మున్సిపల్‌ మంత్రికి కనీసం మున్సిపాలిటీలపై అవగాహన కూడా లేదని, విదేశాలు తిరగడం తప్పా ఆయన ప్రజల సమస్యలు పట్టవని విమర్శించారు. నాగారం హత్య కేసులలో నిందితులుగా ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశంతో కలిసి కేటీఆర్‌ భోజనం చేస్తూ జానారెడ్డిని, కాంగ్రెస్‌ నాయకులను విమర్శించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

మంత్రి జగదీశ్‌రెడ్డికి రాబోయే ఎన్నికల్లో డిపాజిట్‌ కూడా దక్కదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గతంలో నకిలీనోట్ల కేసు, దొంగపాస్‌ పోర్టు కేసులున్నాయని, ఆయనకు గతంలో బ్లాక్‌లో సినిమా టికెట్లు అమ్ముకున్న చరిత్ర కూడా ఉందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వారి ఆస్తులపై విచారణ జరిపించి, అవినీతిపై ఈడీ కేసులు పెడతామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో దామరచర్ల జెడ్పీటీసీ శంకర్‌నాయక్, పీసీసీ సభ్యులు స్కైలాబ్‌నాయక్, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, గడ్డం వేణుగోపాల్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి, పట్టణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కరీం, నాయకులు సంపత్‌రెడ్డి, రామకృష్ణ, కోడిరెక్క శౌరి, మామిడాల ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement