సంక్షేమ ‘భాగ్యం’ చేతికందేనా?

Karnataka Voters Give Siddaramaiah Govt's Performance a 7 Out of 10 - Sakshi

సిద్దరామయ్య పథకాలపై సానుకూలత 

తాజా సర్వేలో కర్ణాటక ఓటర్ల మనోగతం  

సాక్షి, హైదరాబాద్‌ : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ కర్ణాటకలో రాజకీయ వేడి రాజుకుంటోంది. దక్షిణాదిలో గతంలో సొంతంగా అధికారంలోకి వచ్చిన ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో మరోసారి గెలుపుకోసం బీజేపీ తహతహలాడుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ ఈ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకొని దేశవ్యాప్తంగా 2019 సార్వత్రిక ఎన్నికల కోసం నైతిక స్థైర్యాన్ని పెంచుకునే వ్యూహరచనలో నిమగ్నమై ఉంది.

ఈ నేపథ్యంలో కన్నడ ఓటరు నాడి ఎలా ఉంది? సిద్దరామయ్య ప్రభుత్వంపై ప్రజాభిప్రాయమేంటి? అయిదేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆ పార్టీని విజయతీరాలకు చేరుస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌)తో కలసి ‘దక్ష’ అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. 2017 డిసెంబర్‌ నుంచి 2018 ఫిబ్రవరి వరకు నిర్వహించిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.

సంక్షేమ పథకాలపై ప్రజల మాటేంటి?
సంక్షేమ పథకాలనగానే గుర్తొచ్చే పేర్లు.. దివంగత ముఖ్యమంత్రులు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, జయలలితలే. అయితే ఇదే బాటలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా ప్రజలను ఆకట్టుకునేలా ‘భాగ్య’ పేరుతో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వీటికి ప్రజల్లో మంచి ఆదరణ ఉండటంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరోసారి పట్టం గట్టేందుకు అవకాశం ఉందని ఏడీఆర్‌–దీక్ష సర్వే పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ప్రారంభించిన ‘అన్న భాగ్య’ (దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూపాయికే కిలో బియ్యం అందించే పథకం)కు ఈ సర్వేలో భారీ సానుకూలత వ్యక్తమైంది. ఇది అద్భుతమైనదని 79 శాతం మంది కితాబిచ్చారు. పాఠశాలలనుంచి ఆడపిల్లల డ్రాపవుట్స్‌ను తగ్గించేందుకు వారికి ఉచితంగా సైకిళ్లను ఇచ్చే ‘సైకిల్‌ భాగ్య’ పథకం పట్ల కూడా 66% మంది సంతృప్తి వ్యక్తం చేశారు.

అలాగే వాన నీటిని సంరక్షించి సమర్థవంతంగా వినియోగించడం ద్వారా వ్యవసాయ దిగుబడుల్ని పెంచే ‘కృషి భాగ్య’ బాగుందని 58% మంది రైతులు చెప్పారు. నిరుపేదలకు ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్లు ఉచితంగా అందించే ‘అనిల్‌ భాగ్య’ భేష్‌ అని 66 శాతం మంది అన్నారు. వెనుకబడిన, అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన నవదంపతులకు 50 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇచ్చే ‘షాదీ భాగ్య’ పథకంపై కూడా 45 శాతం మంది సంతృప్తి ప్రకటించారు. తమిళనాడు ‘అమ్మ క్యాంటీన్‌’ల స్ఫూర్తితో గతేడాది ఆగస్టులో ఇందిర క్యాంటీన్ల పథకం మాత్రం ఆశించినంతగా ప్రజాదరణ పొందలేదని ఈ సర్వేలో తేలింది. 36 శాతం మంది ఇందిర క్యాంటీన్‌లపై అసంతృప్తి వ్యక్తం చేస్తే 31 శాతం మందే ఈ పథకం బాగుందన్నారు.

పదికి 7 మార్కులు
ఈ సర్వేలో సిద్దరామయ్య ప్రభుత్వ పనితీరుపై అత్యధికులు సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా ఆయన పనితీరుకు 10కి 7 మార్కులు వేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు తేడాల్లేకుండా అత్యధికులు వివిధ రంగాల్లో సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశంసించారు. పాఠశాలల నిర్వహణ (7.85), విద్యుత్‌ సరఫరా (7.83), ప్రజా రవాణా (7.61), అవినీతి నిర్మూలన (6.77) సబ్సిడీ ధరలకే నిత్యావసర వస్తువుల పంపిణీ (7.35), ఉద్యోగ అవకాశాల కల్పన (6.70) వంటి అంశాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందన్నారు. అయితే, ఈ ‘భాగ్య’ పథకాలు సిద్ధరామయ్యకు మరోసారి ‘భాగ్యా’న్నిస్తాయో లేదో చూడాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి ఉండాల్సిందే.          

సిద్దరామయ్య సంక్షేమ పథకాలు  
అన్నభాగ్య
కృషి భాగ్య
సైకిల్‌ భాగ్య
అనిల్‌ భాగ్య
షాదీ భాగ్య
క్షీర భాగ్య
వసతి భాగ్య
ఆరోగ్య భాగ్య
ఇందిరా క్యాంటీన్లు

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top