ముగ్గురు రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

Karnataka rebel MLA R Shankar disqualified by Speaker - Sakshi

ముగ్గురు రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

సాక్షి, బెంగళూరు : విశ్వాస పరీక్ష ముగిసినా కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన 48 గంటల్లోనే కర్ణాటక స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు రెబల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ గురువారం అనర్హత వేటు వేశారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్‌.శంకర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రమేష్‌ జార్జ్‌హోళి, మహేష్‌... 2023 వరకూ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటన చేశారు. విశ్వాస తీర్మానంలో కుమారస్వామి ప్రభుత్వానికి వీరంతా మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్‌ కేపీజేపీ (కర్ణాటక ప్రజకీయ జనతా పార్టీ) తరపును పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఈ ఏడాది జూన్‌ 14న గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. అంతేకాకుండా కేపీజేపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. విలీన ప్రక్రియకు స్పీకర్‌ ఈ ఏడాది జూన్‌ 25న ఆమోదం తెలపడంతో ఆర్‌.శంకర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పరిగణించడం జరిగింది. కాగా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే శంకర్‌ బీజేపీలోకి చేరేందుకు సన్నద్ధం అయ్యారు. దీంతో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య ఆయనపై అనర్హత పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పీకర్‌ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.

17 రోజులు హైడ్రామా
కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ముఖ్యమంత్రి కుమారస్వామి పనితీరుకు వ్యతిరేకంగా రెండు పార్టీల నుంచి 16మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వం ఒక్కసారిగా ప్రమాదంలో పడింది. అయితే ఎవరు ఎందుకు రాజీనామా చేశారనే దానిపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. రాజీనామా చేసిన 16మందిలో 12మంది ముంబయిలో మకాం వేశారు. పార్టీ అధిష్టానం విప్‌ జారీ చేసినప్పటికీ పట్టించుకోలేదు. ముంబయికి ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌తో పాటు కాంగ్రెస్‌ జాతీయ నేతలు గులాంనబీ ఆజాద్‌, కేసీ వేణుగోపాల్‌ వెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోయింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top