కేజ్రీవాల్‌ బాటలో కమల్‌ 

Kamal Haasan Fallows Arvind Kejriwal Political Style - Sakshi

ఒంటరి పోరుకు సిద్ధమౌతున్న వైనం

ముఖ్యమంత్రి పీఠం కోసం ముమ్మర కసరత్తులు

తమిళసినిమా: మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజకీయ పయనాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కమలహాసన్‌ గత ఏడాది పార్టీని ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లారు. గ్రామసభలు, సమావేశాలు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. ముఖ్యంగా కళాశాలల్లోని కార్యక్రమాల్లో పాల్గొంటూ విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మక్కళ్‌ నీది మయ్యం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాననే సంతృప్తితో కమలహాసన్‌ ఉన్నారు. అదే నమ్మకంతో రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒంటరి పోరుకే సిద్ధం అయ్యారు. ఇకపోతే కమలహాసన్‌ తన ప్రచార అస్త్రాలుగా మొదట్లో అన్నాడీఎంకే ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడమే ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగారు. ఆ తరువాత డీఎంకే, బీజేపీ పార్టీలను వదలలేదు. ఇలా అవినీతిపై పోరాటం చేయడంలో కమల్‌ ప్రజాధరణను చూరగొన్నారనే వార్తలు రావడంతో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. కమలహాసన్‌ కాంగ్రెస్‌ పార్టీని మాత్రం విమర్శించడంలేదు.

ఆమ్‌ఆద్మి పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ మొదట్లో ప్రజా సంఘాలను ఏర్పాటు చేసుకుని, ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఏడాదిలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. అలా ఎంజీఆర్, ఎన్‌టీఆర్‌ తరువాత అతికొద్దికాలంలోనే ముఖ్యమంత్రి అయిన పట్టికలో కేజ్రీవాల్‌ చేరారు. ఈయన కూడా అవినీతినే ఆయుధంగా ఎంచుకున్నారు. అవినీతి రహిత పాలను అందిస్తానని ప్రజల్లోకి వెళ్లి వారిని ఆకట్టుకున్నారు. ఇప్పుడు కమలహాసన్‌ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని తమిళనాడులో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదీగాక కేజ్రీవాల్‌తో కమలహాసన్‌ సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఆయన్ని పలుమార్లు కమల్‌ కలిసి చర్చించారు. ఒక దశలో మక్కళ్‌ నీది మయ్యం పార్టీ ఆమ్‌ ఆద్మీ పార్టీతో కూటమి పెట్టుకుంటుందనే ప్రచారం జరిగింది. అయితే అలాంటి పొత్తు ఏమీ లేదని, మక్కళ్‌ నీది మయ్యం ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ నిర్వాహకులు వెల్లడించారు.

కేజ్రీవాల్‌ ప్రచారం
అయితే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రచార మోతకు రాజకీయ నాయకులు సిద్ధం అవుతున్నారు. అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే పార్టీల కూటమి జాతీయ నాయకులతో ప్రచారానికి సిద్ధం అవుతుంటే, డీఎంకే, కాంగ్రెస్‌ మిత్ర పక్షాలు తాము మాత్రం తక్కువా అన్నట్టుగా జాతీయ నాయకులను తమిళనాడులో దించబోతున్నారు. అన్నాడీఎంకే పా ర్టీ సారథ్యంలో బుధవారం వండలూర్‌లో జరగను న్న ప్రచార కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోది పా ల్గొననున్నారు. 13న జరగనున్న డీఎంకే ప్రచార సభకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ  రానున్నారు. ఆ తరువాత సోనియాగాంధీ కూడా రానున్నారు. మక్కళ్‌ నీది మయ్యం పార్టీ ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పాల్గొంటారని ఆ పార్టీ నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తం మీద అన్నాడీఎంకే, బీజేపీల కూటమి, డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీల కూటములను మక్కళ్‌ నీది మయ్యం పార్టీ ఢీకొని ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. ప్రస్తుతం కమలహాసన్‌ పార్టీ అభ్యర్థులకు దరఖాస్తుల అందించే పనిలో ఉన్నారు. రేపు, ఎల్లుండి అభ్యర్థు నుంచి దరఖాస్తులను పార్టీ కార్యాలయంలో ఆయనే స్వయంగా స్వీకరించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారని సమాచారం.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top