ప్రశాంత్‌ కిషోర్‌పై జేడీయూ వేటు

JDU expels Prashant Kishor and Pavan Varma for indiscipline - Sakshi

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని బహిష్కరణ

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌పీఆర్‌) విషయంలో పార్టీ వైఖరిని ప్రశ్నించినందుకు పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ను జనతాదళ్‌(యూ) బహిష్కరించింది. సీఏఏ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తున్న కిషోర్‌... ఈ విషయంలో పార్టీ వైఖరిని తప్పుబడుతున్నారు. నితీశ్‌ ఈ రెండింటికీ మద్దతివ్వటాన్ని ప్రశాంత్‌తో పాటు జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి పవన్‌ వర్మ విమర్శించారు. ఈ రెండింటికీ వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కటవ్వాలని ప్రశాంత్‌ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీనుంచి వారిద్దరినీ బహిష్కరిస్తున్నట్లు జేడీయూ  తెలిపింది. ‘వారిద్దరూ సీఎంను అవమానించేలా మాట్లాడారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించారు’ అని పార్టీ పేర్కొంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి, పార్టీ పదవుల నుంచి తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రశాంత్‌ కిషోర్, పవన్‌ వర్మలను బహిష్కరిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.  

నితీశ్‌ మళ్లీ సీఎం కావాలి: ప్రశాంత్‌
బహిష్కరణ ప్రకటన వెలువడిన వెంటనే ప్రశాంత్‌ కిషోర్‌ ట్వీట్‌ చేశారు.  ‘కృతజ్ఞతలు నితీశ్‌జీ. మీరు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా. గాడ్‌ బ్లెస్‌ యూ’ అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సూచించడం వల్లే ప్రశాంత్‌ కిషోర్‌ను పార్టీలో చేర్చుకున్నానని మంగళవారం నితీశ్‌ చెప్పటంతో ఇద్దరి మధ్యా విభేదాలు తీవ్రమయ్యాయి. దానిపై ప్రశాంత్‌ కిషోర్‌ ఆగ్రహిస్తూ... ‘‘ఎంత దిగజారిపోయారు!!. ఇలాంటి అబద్ధం చెప్పి నన్నూ మీ స్థాయికి లాగుతున్నారా? ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే అమిత్‌ షా సిఫారసులున్న నన్ను తొలగించే ధైర్యం మీకుంటుందా? దాన్ని ఎవరైనా నమ్ముతారా?’’ అని ప్రశ్నించారు.

తృణమూల్‌లో చేరనున్నారా?
ప్రశాంత్‌ త్వరలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరతారని వినిపిస్తోంది. కానీ ఈ వార్తను తృణమూల్‌ వర్గాలు నిర్ధారించలేదు. భవిష్యత్తులో ఆ అవకాశం లేకపోలేదంటూ... ఆ విషయాన్ని ప్రశాంత్‌ కిషోర్‌ లేదా తమ అధినేత్రి మమత బెనర్జీనే ధ్రువీకరించాలని టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ పేర్కొన్నారు. మమత బెనర్జీతో ప్రశాంత్‌కు సంబంధాలున్నాయన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రశాంత్‌ సేవలను టీఎంసీ ఉపయోగించుకుంటోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top