కుమార పన్నాగం

JDS Welcomes To Other Party Ticket Rejectors - Sakshi

ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు గాలం

గెలుపు వీరులకే ద్వారం

సాక్షి, బెంగళూరు: టికెట్‌ దక్కని అసంతృప్తులపై జేడీఎస్‌ కన్నేసింది. కాంగ్రెస్, బీజేపీ టికెట్‌ వస్తుందని వెయ్యి కన్నులతో వేచి చూసిన కొందరు ఆశావహులకు ఆయా పార్టీలు మొండిచేయి చూపించాయి. దీంతో అలాంటి నేతలకు జేడీఎస్‌ గాలం వేస్తోంది. ఆశావహుల్లో ఎన్నికల్లో గెలవగలిగే అభ్యర్థులపై కన్ను వేసి అలాంటి వారికి ఆహ్వానాలు పంపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్యనేత హేమచంద్ర సాగర్, మాజీ ఎమ్మెల్యే ఎంజీ మూలే, మాజీ బీబీఎంపీ సభ్యుడు రామచంద్ర, ఆనంద కుమార్, నటి అమూల్య, కాంగ్రెస్‌ ముఖ్యనేత పి.రమేశ్‌ తదితర నేతలందరూ జేడీఎస్‌లో చేరారు. వీరంతా జేడీఎస్‌ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జేడీఎస్‌ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీలో చేరిపోయారు. రాజరాజేశ్వరినగర నియోజకవర్గం నుంచి రామచంద్రను జేడీఎస్‌ తరఫున బరిలో దింపబోతున్నట్లు దేవెగౌడ తెలిపారు. రోజురోజుకి జేడీఎస్‌ బలం పెరుగుతోందని తెలిపారు.

ఇప్పటికే బయట నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎంఐఎం అధినేతఅక్బరుద్ధీన్‌ ఒవైసీ వంటి నేతలు తమకు మద్దతు లభించిందని తెలిపారు. రాష్ట్రంలో కూడా ప్రజల ఆశీర్వాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయని చెప్పారు. కుమారస్వామి నేతృత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం కచ్చితమని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాయచూరు, హుబ్లీకి చెందిన ప్రముఖ నేతలు జేడీఎస్‌లో చేరనున్నారు. ఈసారి బెంగళూరులోని నియోజకవర్గాల్లో 10 నుంచి 12 స్థానాల్లో తమ పార్టీ గెలిచి తీరుతుందని తెలిపారు. మరోవైపు రామచంద్ర మాట్లాడుతూ... బీజేపీ తనకు అన్యాయం చేసిందని విమర్శించారు. జేడీఎస్‌ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే జేడీఎస్‌ కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాలని చెప్పారు. చిక్కపేటె నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌ ఆశించి భంగపడిన హేమచంద్రసాగర్, సీవీ రామన్‌ నగర్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన పి.రమేశ్‌లు ఆ పార్టీల్లో భంగపాటుకు గురై జేడీఎస్‌లో చేరారు. ఈ సమావేశంలో జేడీఎస్‌ ముఖ్యనేతలు జఫరుల్లాఖాన్, కె.గోపాలయ్య, శరవణ, ఆర్‌.ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top