తెలుగుదేశం ‘బీ’ టీమ్‌గా జనసేన 

Janasena Is Acting In TDP Direction - Sakshi

చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటున్న జనసేన   

సాక్షి, అమరావతి: ‘ప్రశ్నించడానికే జనసేన’ అంటూ సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ ఏర్పాటుచేసిన రాజకీయ పార్టీ జనసేన గతం, వర్తమానమే కాదు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగానే మిగిలింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా అధికార పార్టీ నీడగా సాగుతూ వచ్చి ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ‘బీ’ టీమ్‌గా స్థిరపడిపోయింది. తాజాగా నెలకొంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రశ్నించడంతోపాటు తన పార్టీకి ఏడు లక్ష్యాలున్నాయంటూ ప్రకటించిన జనసేనాని పవన్‌కల్యాణ్‌ ఏనాడూ అధికార తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న అరాచకాలను ప్రశ్నించిన పాపాన పోలేదన్నది అందరికీ తెలిసిందే. పైగా పలు ప్రజావ్యతిరేక సమస్యలపై ప్రజలు, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం సాగిస్తున్న సమయాల్లో బయటకు వచ్చి వాటిని పక్కదారి పట్టించేలా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు.

రాజధాని భూముల బలవంతపు భూసేకరణ, ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యతో సహా అనేక అంశాలపై ఆయన ప్రభుత్వానికి అండదండలు అందిస్తూ ప్రజానీకాన్ని వంచించిన సంగతి తెలిసిందే. మొదటి నుంచీ చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్‌ నడుచుకుంటూ వచ్చారన్న విషయం ఇరు పార్టీల నేతలే అంగీకరిస్తున్నారు. టీడీపీకి ఇబ్బందికర పరిణామాలు తలెత్తిన ప్రతిసారీ పవన్‌కల్యాణ్‌ను రంగంలోకి దింపి ఆ సమస్యలను పక్కదారి పట్టించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తూ వచ్చారు. జనసేనను స్థాపించింది పవన్‌కల్యాణే అయినా దాని కర్త.. కర్మ.. క్రియ మొత్తం చంద్రబాబేనని రాజకీయ విశ్లేషకులు మొదట్నుంచీ అనుమానిస్తూ వచ్చారు. ఐదేళ్లలో పవన్‌కల్యాణ్‌ వ్యవహరించిన తీరు కూడా వారి విశ్లేషణలకు బలం చేకూర్చాయి. తాజా ఘటనలతో అవి మరింత బలపడుతున్నాయి. 

బాబు సూచనలతోనే లక్ష్మీనారాయణ జనసేనలోకి..
కాగా, సీబీఐ మాజీ జాయింట్‌ డైరక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ ఆదివారం అకస్మాత్తుగా జనసేనలో చేరారు. చంద్రబాబు సూచనలతోనే ఈ వ్యవహారం సాగిందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సీబీఐ జాయింట్‌ డైరక్టర్‌గా కొనసాగిన కాలంలో లక్ష్మీనారాయణ చంద్రబాబు, కాంగ్రెస్‌ పెద్దల కనుసన్నల్లో కొనసాగుతూ వైఎస్‌ జగన్‌పై అక్రమంగా దాఖలు చేయించిన కేసుల్లో నిబంధనలకు విరుద్ధమైన దర్యాప్తు సాగించారన్న విమర్శలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో అటు జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఇటు లక్ష్మీనారాయణను చంద్రబాబే తెరవెనుక నుంచి నడిపిస్తున్నారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ప్రజల్లో తన ప్రభుత్వంపట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వైపు వెళ్లకుండా ఉండేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వీరిద్దరినీ తెరపైకి తెచ్చారన్నది జగద్విదితం.

లక్ష్మీనారాయణ కొన్నిరోజులు రాజకీయ పార్టీ స్థాపిస్తానని చెప్పడం, ఆ తరువాత కొద్దిరోజులకు లోక్‌సత్తా పార్టీకి నేతృత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, లక్ష్మీనారాయణను తెలుగుదేశంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆలోచించారు. ఇందుకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలుసుకునేందుకు అనుకూల మీడియా ద్వారా లీకులిచ్చారు. ముసుగులు తొలగిపోతూ ఒకరికొకరుగా సహకరించుకొనేందుకే ఇన్నాళ్లుగా తెరవెనుక డ్రామాలాడించి ఇప్పుడీ విధంగా చేస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా రావడంతో చంద్రబాబు రూటు మార్చారు. రాత్రికి రాత్రి చంద్రబాబు సూచనల మేరకు పవన్‌కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. దీంతో జనసేన తెలుగుదేశం పార్టీకి ‘బీ’ టీమ్‌ అన్న అంశం ప్రజలకు స్పష్టంగా అర్ధమైంది. కేవలం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసేందుకే జనసేన పార్టీని పవన్‌కల్యాణ్‌ ఏర్పాటుచేశారన్న అభిప్రాయం ప్రజలందరిలో ఇప్పుడు బలపడుతోంది.

బాబు డైరెక్షన్‌లోనే మాయావతితో పవన్‌ భేటీ..
ఇటీవల పవన్‌కల్యాణ్‌ లక్నో వెళ్లి బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఇది కూడా చంద్రబాబు సూచనల మేరకే జరిగిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే అంతకు ముందు పవన్‌కల్యాణ్‌ మాయావతిని కలసి పొత్తులపై చర్చించేందుకు రెండు మూడుసార్లు ప్రయత్నించినా ఆమె స్పందించలేదు. చంద్రబాబు వినతి మేరకు మాయావతి పవన్‌తో భేటీకి, పొత్తుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆమె అంగీకరించడమే ఆలస్యమన్నట్లు పవన్‌ ఆగమేఘాల మీద బీఎస్‌పీకి 21 అసెంబ్లీ సీట్లు, 3 లోక్‌సభ సీట్లు కేటాయించి సొంత పార్టీ వారినే విస్మయానికి గురిచేశారు. మరోవైపు.. సీపీఎం, సీపీఐ పార్టీలు పవన్‌ వెంట ఏడాదికిపైగా తిరుగుతున్నా వారికి చెరొక ఏడు అసెంబ్లీ స్థానాలు, చెరో రెండు లోక్‌సభ స్థానాలే కేటాయించారు. రాష్ట్రంలో అసలు  పునాదులే లేని బీఎస్పీకి ఎక్కువ సంఖ్యలో కేటాయించి, వామపక్షాలకు తక్కువ స్థానాలు కేటాయించడం గమనార్హం.  ఇదంతా కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటే కాకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బలమైన పునాదిగా ఉన్న వర్గాల ఓట్లను చీల్చేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడగా అందరికీ అర్థమవుతోంది.

ఆ ఇద్దరి కోసమే టీడీపీ సీట్లు పెండింగ్‌లో..
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు కొన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించినా.. కీలకమైన కొన్ని స్థానాలను మాత్రం పెండింగ్‌లో ఉంచారు. పవన్‌ కల్యాణ్, లక్ష్మీనారాయణల కోసమే ఇలా చేశారన్న అభిప్రాయం తెలుగుదేశం నుంచే వినిపిస్తోంది. పవన్‌కల్యాణ్, లక్ష్మీనారాయణలు పోటీచేయవచ్చని ప్రచారం జరుగుతున్న గాజువాక, భీమిలి, పెందుర్తి తదితర సీట్లకు చంద్రబాబు తన అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. వాళ్లిద్దరూ పోటీచేసే నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి పరోక్షంగా వాళ్లకు సహకరించేందుకే చంద్రబాబు ఆయా స్థానాలను ప్రకటించలేదని తెలుస్తోంది. గాజువాకలో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నా ఆయన పేరును ఖరారుచేయలేదు. అలాగే, పెందుర్తిలో ఐదుసార్లు గెలిచిన సీనియర్‌ నేత మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి టికెట్‌ను కూడా చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారు. 

సీ–టీమ్‌గా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌
మరోవైపు.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీతో కూడా చంద్రబాబునాయుడు పొత్తులకు దిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని కలిసి పోటీచేశారు. అయితే, దానిని ప్రజలు ఛీత్కరించడంతో చంద్రబాబుకు తీవ్ర భంగపాటు ఎదురైంది. దీంతో ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తుల్లేవని ప్రకటించారు. కానీ, ఇదంతా బయటకు మాత్రమే కనిపించే సీన్‌. లోపల మాత్రం ఇరు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే తీరులోనే నడుస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి జనసేన ‘బీ’ టీమ్‌గా.. కాంగ్రెస్‌ ‘సీ’ టీముగా పనిచేస్తున్నాయి. కాగా, రాష్ట్ర విభజనతో గత ఎన్నికల్లో అడ్రస్‌ లేకుండాపోయిన కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లను చంద్రబాబు టీడీపీలోకి చేర్చుకుని బరిలోకి దింపుతున్నారు. అలాగే, వైఎస్సార్‌సీపీ ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థులనూ ఆయనే నిర్ణయించేలా తెరవెనుక పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ఇప్పటివరకు విడుదల కాలేదు. అంతేకాక.. జనసేన, కాంగ్రెస్‌ అభ్యర్థులకు అవసరమైన నిధులు, ఇతర సహాయ సహకారాలు మొత్తం కర్ణాటక, తెలంగాణలో మాదిరిగా చంద్రబాబే అందిస్తున్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top