‘కేసీఆర్.. టీఆర్ఎస్‌ పార్టీని అమ్మొద్దు’

Jaipal Reddy Slams KCR And PM Modi And Amit Shah - Sakshi

సాక్షి, హైదరాబాద్ : బీజేపీకి చెందిన ఓ తోకపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడికి పోయిందో చెప్పాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు ప్రధాని నరేంద్ర మోదీకి సిద్ధాంతాల గురించి ఏ మాత్రం తెలియదన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఓ వ్యాపారి అని.. ఆయనకు అమ్మడం, కొనడం మాత్రమే తెలుసునని జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలు పెంచుతున్నా మోదీకి సీఎం కేసీఆర్ సహకరించడాన్ని తప్పుపట్టారు. ఎన్నికలు వచ్చే వరకు మోదీకి మిత్రపక్షంగా కేసీఆర్ ఉంటారని, కానీ టీఆర్‌ఎస్‌ పార్టీని మాత్రం బీజేపీకి అమ్మవద్దని పేర్కొన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఇచ్చిన హామీలతో పాటు తెలంగాణకి సమానంగా ఐటీఐఆర్, ఉక్కు ఫ్యాక్టరీలను నెలకొల్పాలని.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం నిధులు కేంద్రాన్ని అడగాలని కేసీఆర్‌ను సూచించారు. తెలంగాణ ప్రజల హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారని కాగ్ రిపోర్ట్ ద్వారా తేలిందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎమ్ ప్రకారం ఆర్థిక, ద్రవ్య భద్రత కోసం లోన్ తీసుకోవచ్చన్నారు. ద్రవ్యోల్బణంతో అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నవని, ద్రవ్యలోటు 4.7 శాతం పెరిగిందని తెలిపారు. 60 వేల కోట్ల రూపాయల అప్పును 2.21 లక్షల కోట్ల రూపాయలకు పెంచిన ఘనత కేసీఆర్‌దేనని చురకలు అంటించారు. 70 ఏళ్లలో చేసిన అప్పుల కంటే 4 ఏళ్లలోనే రెండింతల అప్పులు ఎక్కువ చేశారంటూ మండిపడ్డారు. మన వ్యవస్థలో కాగ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. టీఆర్ఎస్ నేతలకు అవి కాకి లెక్కల్లా కనిపిస్తున్నవని, అయినా వారికి ఇంత పెద్ద విషయాలు అర్థం కావని అభిప్రాయపడ్డారు. ముందు తరాలను నాశనం చేసే అధికారం ఎవరిచ్చారని కేసీఆర్‌ను కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి ప్రశ్నించారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top