‘మోదీకి అంబానీ బ్రోకర్‌’

Jaipal Reddy Fire On Narendra Modi Over Rafale Jet Deal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్‌ యుద్ద విమానాల కోనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలు తాజాగా నిజమయ్యాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌ రెడ్డి శనివారం మీడియాకు వివరించారు. రాఫెల్‌ స్కామ్‌ జరిగింది నిజమని.. ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్‌ హొలాండే వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. రాఫెల్‌ డీల్‌తో నాలుగేళ్లలో అంబానీకి లక్ష కోట్ల లబ్ధి జరుగుతందన్నారు. లక్షల కోట్ల రాఫెల్‌ డీల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వెంట ఒక్క మంత్రి లేరని, కానీ అంబానీ మాత్రం ఉన్నారని ఎద్దేవ చేశారు. అప్పటి రక్షణ మంత్రి పారికర్‌కు కూడా తెలియకుండా, ప్రధానే నేరుగా ఎలా ఒప్పందం చేసుకుంటారని ప్రశ్నించారు. మోదీ ఒత్తిడితోనే అంగీకరించామని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడి కామెంట్స్‌పై బీజేపీ ఏం చెబుతుందని ప్రశ్నించారు. 

రాఫెల్‌తో మోదీ పతనం
ఈ ఒప్పందంపై మంత్రులు అరుణ్‌ జైట్లీ, నిర్మలా సీతారామన్‌లు పార్లమెంట్‌లో అబద్దం చెప్పారని మండిపడ్డారు. జాతికి అబద్దం చెప్పినందుకు వారు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పతనం ఈ స్కాంతో ప్రారంభమైందన్నారు. దేశానికి సంబంధించిన డీల్‌ను మరో దేశ ప్రభుత్వం ఖండించడం దేశ చరిత్రలోనే మొదటిసారని పేర్కొన్నారు. నోరు తెరిస్తే బయటపడతాననే ప్రధాని రాఫెల్‌పై మాట్లాడటం లేదని, ఆయన నాటకం తేలిపోయిందని విమర్శించారు.

మోదీకి జైట్లీ లాయల్‌ లాయర్‌
నరేంద్ర మోదీ క్రోనీ క్యాపిటలిజంతో కావల్సిన వారికి వేల కోట్లు దోచిపెడుతున్నారని విమర్శించారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ.. మోదీకి లాయల్‌ లాయరని అంతేకాని దేశానికి కాదన్నారు. ఈ డీల్‌ పారదర్శికంగా ఉండాలన్నదే కాంగ్రెస్‌ వాదన అని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఈఎల్‌కు కాకుండా అంబానీకి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గతంలో ఏ రక్షణ ఒప్పందంలో కూడా హెచ్‌ఈఎల్‌కే నాటి ప్రభుత్వాలు భాగస్వామ్యం కల్పించాయన్నారు. నిజాలు ఆపలేరని, రాఫెల్‌లో జరిగిన అవినీతిని ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top