రాజకీయాల్లోకి ముగ్గురు ఐపీఎస్‌లు!

IPS Officers Want To Become Politicians In Telangana - Sakshi

ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు 

పెద్దపల్లిలో ఇప్పటికే 20 మండలాలు చుట్టేసిన సీనియర్‌ ఐపీఎస్‌ 

సొంత నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల్లో మరో అధికారి 

వరంగల్‌ నుంచి పోటీకి  సిద్ధమవుతున్న ఇంకో ఐపీఎస్‌ 

ఏ పార్టీ నుంచి టికెట్‌ హామీ వచ్చినా.. వీఆర్‌ఎస్‌కు రెడీ 

సాక్షి, హైదరాబాద్‌ : పోలీస్‌ శాఖలో విజయవంతమైన అధికారులుగా గుర్తింపు పొందిన పలువురు సీనియర్‌ ఐపీఎస్‌లు రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పని చేస్తున్న ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లతోపాటు ఉత్తరాది రాష్ట్ర కేడర్‌కు చెందిన తెలంగాణ వాసి కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు నిఘా వర్గాలు ద్వారా తెలిసింది.

పెద్దపల్లి నుంచి పోటీ చేసేందుకు.. 
రాష్ట్రంలో సీనియర్‌ ఐజీగా పనిచేస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ ముందు నుంచి టెర్రర్‌ అధికారిగా గుర్తింపు సాధించారు. కఠిన శ్రమ, తనతోపాటు మిగతా వారిని ప్రోత్సహిస్తూ ఉద్యోగాన్ని ఉల్లాసంగా చేస్తారన్న పేరుంది. కీలక జిల్లాలకు ఎస్పీగా పని చేసిన ఆయన కొన్నేళ్లుగా యువతకు కీలకమైన విభాగాన్ని లీడ్‌ చేస్తున్నారు. ఆయనకు యువతలో మంచి క్రేజ్‌ కూడా ఉండటంతో పార్లమెంట్‌కు పోటీ చేయాలని భావిస్తున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. దక్షిణ తెలంగాణలోని ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినా.. అక్కడి కంటే పెద్దపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ స్థానం నుంచి గెలిచిన వారంతా పొలిటికల్‌ కెరీర్‌లో సూపర్‌ సక్సెస్‌ అయ్యారని, ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని 20 మండలాల్లో ఆయన పర్యటించినట్టు సమాచారం  

రాజకీయ కుటుంబం నుంచి వచ్చి.. 
రాజకీయ కుటుంబం నుంచి వచ్చి పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న మరో డీఐజీ స్థాయి అధికారి సైతం పార్లమెంట్‌కు పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. గతంలోనే వరంగల్‌ నుంచి కానీ పెద్దపల్లి నుంచి కానీ పోటీ చేయాలనుకున్న కొన్ని కారణాల వల్ల నిర్ణయం వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో వరంగల్‌ నుంచి గానీ, లేదా మరో స్థానం నుంచి గానీ పోటీ చేసేందుకు ఆసక్తి కనపరుస్తున్నట్టు పోలీస్‌ శాఖలో చర్చ జరుగుతోంది. రాజకీయ కుటుంబం కావడం, పైగా పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న పేరు ఉండటంతో ఈసారి పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. 

సొంత నియోజకవర్గం నుంచి బరిలోకి.. 
ఉమ్మడి వరంగల్‌ జిల్లా వాసి, ఉత్తరాది రాష్ట్ర కేడర్‌ ఐపీఎస్‌గా పనిచేస్తున్న మరో అధికారి.. తన సొంత నియోజకవర్గం నుంచే ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసుల్లోని ఓ భద్రత విభాగంలో పనిచేస్తున్నారు. కొన్నేళ్ల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గానికి ఆయన సుపరిచితుడయ్యారు. పేద పిల్లలకు విద్య, హెల్త్‌ క్యాంపులు.. ఇతర సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నారు. గతం లో పోటీ చేసేందుకు ప్రయత్నించినా టికెట్‌ హామీ రాకపోవడంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

ఏ పార్టీ అయినా సరే!
ఈ ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు ఎంపీ టికెట్‌ కోసం ప్రధాన పార్టీలను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. తాము చేస్తున్న కార్యక్రమాలు, తమకు అనుకూలంగా ఉన్న అంశాలు, సొంత సర్వే రిపోర్టులు, తమ సామాజిక వర్గాల ఓటర్లు, వారికి తోడ్పాటు అందించే వర్గాల జాబితాతో పార్టీల ముందు ఎంపీ టికెట్‌ ప్రతిపాదన పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. నాలుగు ప్రధాన పార్టీల నుంచి ఏ పార్టీ టికెట్‌ ఇచ్చినా పోటీ చేసేందుకు సిద్ధమన్న సంకేతాలను తమ అనుచరులకు, తమ వర్గాల వారీకి పంపించినట్టు తెలిసింది. పార్టీల నుంచి టికెట్‌ హామీ రాగానే వీఆర్‌ఎస్‌ (స్వచ్ఛంద పదవీ విరమణ) తీసుకునే విషయంలో ఈ ముగ్గురు అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఐపీఎస్‌గా సర్వీసులో చేరి 20 ఏళ్లు కూడా కావస్తున్న నేపథ్యంలో పెన్షన్‌కు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో వీఆర్‌ఎస్‌కు సిద్ధపడుతున్నట్టు వారి సన్నిహితులు తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top