మొదటి రౌండ్‌లోనే డౌట్‌ వచ్చింది: పద్మావతి

Huzurnagar Bypolls Result 2019 Not Correct, Says Padmavathi - Sakshi

సాక్షి, సూర్యాపేట: ఉప ఎన్నికల్లో ఓటమి బాధ కలిగించిందని హుజుర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతి అన్నారు. ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. హుజూర్‌నగర్ ఓటు, నియంతృత్వ కేసీఆర్ పాలనకు ప్రశ్నగా మారుతుందనుకున్నామని వ్యాఖ్యానించారు. ఈ ఉపఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నియంతృత్వ పాలన అంతం కావాలని అందరూ అనుకున్నారని చెప్పారు. యావత్‌ తెలంగాణ ప్రజల మనోభావాలను మోసుకుంటూ అభ్యర్థిగా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని పేర్కొన్నారు. తమ ఆకాంక్షను హుజురాబాద్ ఉప ఎన్నిక ద్వారా తెలియజెప్పాలని ప్రజలంతా కోరుకున్నారని చెప్పారు. వ్యక్తిగతంగా హుజుర్‌నగర్‌ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు.

ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు పలికినా ఓడిపోవడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. మొదటి రౌండ్‌లోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 2 వేల ఆధిక్యం అనగానే తనకు అనుమానం వచ్చిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా టీఆర్ఎస్ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. ఈవీఎంలలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. తమ బంధువులు వేసిన ఓట్లు కూడా పడలేదని స్వతంత్ర అభ్యర్థులు తనదో చెప్పారని, దీనిబట్టి చూస్తే ఈవీఎంలపై అనేక అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. ఈవీఎంలను మేనేజ్‌ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందని, ఈ ఫలితం​ కరెక్ట్‌ కాదని పద్మావతి అన్నారు. (చదవండి: హుజుర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం ఇలా...)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top