హిమాచల్‌లో కమలం వికాసం | Himachal Pradesh Election bjp win | Sakshi
Sakshi News home page

హిమాచల్‌లో కమలం వికాసం

Dec 19 2017 2:32 AM | Updated on Mar 29 2019 5:33 PM

Himachal Pradesh Election bjp win - Sakshi

హిమాచల్‌లో పార్టీ గెలిచాక ధర్మశాలలో పోలింగ్‌ కేంద్రం వద్ద బీజేపీ మహిళాకార్యకర్తల సంబరాలు

సిమ్లా: ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే సంప్రదాయం హిమాచల్‌ప్రదేశ్‌లో ఈసారి కూడా కొనసాగింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాల్ని నిజం చేస్తూ హిమాలయ రాష్ట్రంలో కాంగ్రెస్‌ నుంచి బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. సోమవారం వెలువడిన ఫలితాల్లో మొత్తం 68 సీట్లలో బీజేపీ 44, కాంగ్రెస్‌ 21, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. 2012 ఎన్నికల్లో ఓటమిపాలైన బీజేపీ మళ్లీ అధికారం చేపట్టేందుకు రంగం సిద్ధమైంది.

అయితే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ ధూమల్‌ ఓడిపోవడంతో, సీఎం పదవి ఎవరికి దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ ప్రారంభమైంది. ప్రభుత్వ వ్యతిరేకత, ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌పై అవినీతి ఆరోపణలు కాంగ్రెస్‌ అవకాశాలను దెబ్బతీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి బీజేపీకి దక్కిన ఓట్ల శాతం 10 శాతం పెరిగి 48.7 శాతానికి చేరగా, కాంగ్రెస్‌కు ఒకశాతం తగ్గి 41.8 శాతానికి పరిమితమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 36 సీట్లు, బీజేపీ 26 సీట్లు గెలుచుకున్నాయి.  

ధూమల్‌ ఓటమి...వీరభద్రసింగ్‌ గెలుపు
బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్పష్టమైన ఆధిక్యం లభించినా ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ ధూమల్‌ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. సుజాన్‌పూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి, ఒకప్పటి తన అనుచరుడు రాజిందర్‌సింగ్‌ రాణా ఆయనపై 3,500 ఓట్ల తేడాతో గెలుపొందారు. కుట్లేహర్‌ స్థానం నుంచి గెలుపొందిన బీజేపీ నాయకుడు వరీందర్‌ కన్వర్‌ అవసరమైతే తన సీటును ధూమల్‌ కోసం త్యాగం చేస్తానని ప్రకటించారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ ఆర్కి నియోజకవర్గంలో గెలుపొందారు.

ఆయన బీజేపీ అభ్యర్థి రతన్‌సింగ్‌ పాల్‌పై 6,051 ఓట్ల ఆధిక్యం సాధించారు. తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన వీరభద్రసింగ్‌ కొడుకు విక్రమాదిత్య సింగ్‌ సిమ్లా(గ్రామీణ) స్థానం నుంచి గెలుపొందారు. ధూమల్‌ ఓటమితో బీజేపీలో సందిగ్ధత నెలకొంది. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అసెంబ్లీకి ఎన్నిక కాకపోవడంతో మరో నాయకుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తన ఓటమిని ఊహించలేదని, ఇందుకు కారణాలను తరువాత విశ్లేషిస్తానని ధూమల్‌ తెలిపారు. రాజిందర్‌ రాణా స్పందిస్తూ...తన గెలుపు కాంగ్రెస్‌పై ప్రజలకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement