ఎమ్మెల్యేల తరలింపు.. పె...ద్ద హైడ్రామా

High Drama on Congress-JDS MLAs Reached to Hyderabad - Sakshi

సాక్షి, బెంగళూరు/హైదరాబాద్‌: నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే వారిని తొలుత పంజాబ్‌గానీ, కేరళగానీ తరలించాలని భావించగా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఒకానోక దశలో శరవేగంగా పరిణామాలు మారే అవకాశం ఉండటంతో ఆలస్యం చేయకుండా వారిని హైదరాబాద్‌ తరలించినట్లు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న పరిణామాలు ఎలా ఉన్నాయో చూద్దాం...

యెడ్డీ ఆదేశాల తర్వాత... ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన గంట తర్వాత యెడ్యూరప్ప.. పోలీస్‌ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బస చేసిన ఈగల్‌టన్‌ గోల్ఫ్‌ రిసార్ట్‌, షాంగ్రీ-లా హోటల్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎత్తేయాలని, భద్రత ఉపసంహరించుకోవాలని ఆయన ఆదేశించారు. గంటల వ్యవధిలోని పోలీస్‌శాఖ ఆ ఆదేశాలను అమలు చేసింది. దీంతో తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు వారిని వెంటనే రాష్ట్రం తరలించాలని ఆయా పార్టీలు ప్రణాళిక రచించాయి. కాంగ్రెస్‌ తరపున డీకే శివకుమార్‌, జేడీఎస్‌ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ఎమ్మెల్యేలు వారిని ఎక్కడ దాచాలన్న దానిపై మంతనాలు జరిపారు. 

ఆటంకాలు... తొలుత వారిని ఛార్టెడ్‌ ఫ్లైట్‌ల ద్వారా కొచ్చి(కేరళ)కు గానీ తరలించాలని అనుకున్నారు. అయితే డీజీసీఏ(Directorate General of Civil Aviation) నుంచి విమానానికి అనుమతి లభించకపోవటం, దానికి తోడు కొచ్చిలో హోటళ్లు ఖాళీగా లేవని సమాచారం రావటంతో (ఇదంతా బీజేపీ కుట్ర అన్నది వారి ఆరోపణ) తప్పనిసరై మరోచోటకు తరలించాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. అంతకు ముందు జేడీఎస్‌ సుప్రీం దేవగౌడ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడి.. వారి నుంచి హామీ పొందిన విషయం తెలిసిందే. దీనికితోడు పొరుగునే ఉన్న తమిళనాడు అన్నాడీకేం ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. అందుకే వారి కోసం హైదరాబాద్‌ బెస్ట్‌ ప్లేస్‌ అని భావించి ఆ ప్రయత్నాలు ప్రారంభించారు.

ఎమ్మెల్యేల తరలింపు సాగిందిలా... తమ తరలింపు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన ఎమ్మెల్యేలు.. దుస్తులను నేరుగా హోటళ్ల వద్దకే తెప్పించుకున్నారు. రాత్రి 11.30 ని. సమయంలో డీజీసీఏ.. ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరించింది. దీంతో ఫ్లాన్‌ మార్చి వారిని రాష్ట్రం దాటించాలని నిర్ణయించారు. చివరకు ఎమ్మెల్యేలకు కూడా వాళ్లను ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయం తెలీకుండా జాగ్రత్త పడ్డారు. అర్ధరాత్రి 12గం.15 ని. సమయంలో శర్మ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఈగల్‌టన్‌ రిసార్ట్‌ నుంచి ఎమ్మెల్యేలతో బయలుదేరాయి. అనంతరం షాంగ్రీ-లా హోటల్‌ వద్దకు చేరుకుని అక్కడ జేడీఎస్‌ ఎమ్మెల్యేలను ఎక్కించుకుని బయలుదేరాయి. బస్సులు నిండిపోవటంతో మరో బస్సు(స్లీపర్‌) వాటికి కలిసింది. ఎమ్మెల్యేలకు భోజనం, దుప్పట్లు ఇలా పరిస్థితులు సర్దుకున్నాక ఆ మూడు బస్సులు వేగంగా ఆంధ్రా సరిహద్దు వైపు కదిలాయి. 

ముందస్తు జాగ్రత్తగా... అయినప్పటికీ బీజేపీ నుంచి అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందని భావించి సరిహద్దు వరకు పలు ప్రాంతాల్లో(గౌరీబిదనూరు, చికబళ్లాపూర్‌ జిల్లాలో) ముందస్తుగా కొన్ని వాహనాలను ఉంచారు. ఒకవేళ వారిని అడ్డుకునే యత్నాలు జరిగితే స్థానిక నేతల సాయంతో ఆయా వాహనాల్లో వారిని రహస్య ప్రదేశాలకు తరలించాలని భావించారు. శర్మ ట్రావెల్స్‌ డ్రైవర్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంది. ఆంధ్రా బార్డర్‌ వరకు ఎమ్మెల్యేలు జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌, శివరామ హెబ్బర్‌లు స్వయంగా బస్సులు నడిపినట్లు తెలుస్తోంది. కర్నూల్‌ మీదుగా ప్రయాణించిన వాహనాలు ఉదయం 5 గంటల సమయంలో హైదరాబాద్‌కు 80 కిలోమీటర్లు దూరంలో ఆగారు. అక్కడ ఎమ్మెల్యేలు కాఫీ బ్రేక్‌ తీసుకున్నాక తిరిగి బయలుదేరారు. చివరకు గంటర్నర ప్రయాణం తర్వాత నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. 

మధు యాష్కీ మాటల్లో.. ‘మా పార్టీ ఎమ్మెల్యేల తరలింపు చాలా ప్రణాళిక బద్ధంగా జరిగింది. వారికి హైదరాబాద్‌లో ఉంచటమే సురక్షితమని భావించి ఇక్కడికి రప్పించాం. అధికారం కోసం బీజేపీ దారుణంగా దిగజారింది. అందుకు ప్రధాని మోదీ మద్ధతు పలకటం దారుణం. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ సింగ్‌ను బీజేపీ కిడ్నాప్‌ చేసింది. ఆయన కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేస్తోంది. బీజేపీ నేతలు క్రిమినల్స్‌లాగా వ్యవహరిస్తున్నారు’ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధు యాష్కీ మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top