నమ్మకానికి పెద్దపీట

Guntur YSRCP Leaders Profiles - Sakshi

వైఎస్‌ కుటుంబాన్ని నమ్మినవారికి మంత్రి పదవులు

గతంలో ఎమ్మెల్యే పదవి వదిలి వైఎస్‌ జగన్‌ వెంటే నడిచిన సుచరిత

మంత్రి పదవితో గుర్తింపునిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఎన్నికల్లో ఓటమి పాలైనా మోపిదేవిని వరించిన మంత్రి పదవి

కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్‌ పదవి

ఉత్కంఠ వీడింది.. జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు, మరొకరికి డెప్యూటీ స్పీకర్‌ పదవి దక్కాయి. తమ కుటుంబాన్ని నమ్ముకుని కష్టనష్టాలను భరించిన మోపిదేవి వెంకటరమణ, మేకతోటి సుచరితకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి పదవులు కట్టబెట్టారు. జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.

సాక్షి, గుంటూరు: విశ్వసనీయతకు మరోసారి ఫలితం దక్కింది. వైఎస్‌ కుటుంబం నమ్మినవారిని వదిలిపెట్టదన్న విషయం మళ్లీ రుజువైంది. నాడు తమకోసం ఎమ్మెల్యే పదవులను త్యజించా రనే కారణంతో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టారు. సామాజిక న్యాయం పాటిస్తూ జిల్లా నుంచి ఎస్సీ మహిళ మేకతోటి సుచరిత, బీసీ వర్గానికి చెందిన  మోపిదేవి వెంకటరమణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనక్యాబినెట్‌లో చోటు కల్పించి తమను నమ్ముకున్నవారికి ఎప్పుడూ అన్యాయం జరగదనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల్లో ఓటమి చెందిన మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చి అక్కున చేర్చుకున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్‌ పదవి ఇచ్చి జిల్లాకు సముచిత స్థానం కల్పించారు.

మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జిల్లాలో మొదటి నుంచి దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అనుచరుడిగా పేరుపొందారు. 1999లో కూచినపూడి నియోజకవర్గం (ప్రస్తుతం రద్దయింది) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మోపిదేవి 2004లో సైతం అక్కడి నుంచే విజయం సాధించారు. దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి కాగానే మోపిదేవికి తన క్యాబినెట్‌లో స్థానం కల్పించారు. 2009లో సైతం తన క్యాబినెట్‌లో మంత్రి పదవి కట్టబెట్టి జిల్లాలో తన అనుచరుడిగా చూసుకుంటూ వచ్చారు. వైఎస్సార్‌ మరణా నంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో జైలుకు వెళ్లి, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ వైఎస్సార్‌ కుటుంబంపై ఉన్న విశ్వాసంతో ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్‌ జగన్‌ 2019లో సైతం మోపిదేవిని రేపల్లె నుంచి బరిలో నిలిపారు. అనూహ్యంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో స్వల్ప తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. జిల్లాలో 15 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే. వీరిలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే లెక్కలు వేసుకుంటున్న తరుణంలో నమ్ముకున్న వారికి తమ కుటుంబం ఎన్నడూ అన్యాయం చేయదని రుజువు చేస్తూ ఓటమి పాలైన మోపిదేవికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాబినెట్‌లో స్థానం కల్పించారు. బలహీన వర్గానికి చెందిన మోపిదేవికి మంత్రిపదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మోపిదేవికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తగిన న్యాయం చేశారంటూ అంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.

తండ్రి ఎమ్మెల్యేని చేస్తే తనయుడు మంత్రిని చేశాడు
జిల్లాలో ఎస్సీ మహిళ ఎమ్మెల్యేగా మూడో సారి గెలుపొందిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు తన కేబినెట్‌లో స్థానం కల్పించి ఆమె చేసిన త్యాగం వృథా కాలేదనే విషయాన్ని ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రుజువు చేశారు. 2006లో రాజకీయాల్లోకి వచ్చి ఫిరంగిపురం నుంచి జెడ్పీటీసీగా గెలిచిన మేకతోటి సుచరిత దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వుడ్‌ స్థానమైన ప్రత్తిపాడు టిక్కెట్టు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దినెలలకే ఆయన దుర్మరణం పాలవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలన్ని మారిపోయాయి. కాంగ్రెస్‌ పార్టీని వదిలి వైఎస్‌జగన్‌ బయటకు వచ్చిన మరుక్షణం వైఎస్సార్‌పై ఉన్న అభిమానంతో సుచరిత ఎమ్మెల్యే పదవికి సైతం తృణప్రాయంగా వదిలేసి ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ వెంట నడిచారు. ఆమెపై అనర్హత వేటు వేసినప్పటికీ వైఎస్‌ జగన్‌ స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమిపాలైనప్పటికీ 2019 ఎన్నికల్లో మాత్రం విజయఢంకా మోగించారు. మూడుసార్లు గెలిచిన సుచరితకు తన కేబినెట్‌లో స్థానం కల్పించి తమ కుటుం బాన్ని నమ్మిన వారికి అండగా నిలబడతారనే విషయాన్ని వైఎస్‌జగన్‌ చేతల్లో చేసి చూపారు. సుచరితను తండ్రి వైఎస్సార్‌ ఎమ్మెల్యేను చేస్తే ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ ఏకంగా మంత్రిని చేసి విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలి చారు. ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా తమను నమ్మితే వారికి పెద్ద పీట వేస్తామనే విషయాన్ని రుజువు చేసిచూపారు. సుచరితకు మంత్రి పదవి కట్టబెట్టడంపై ఎస్సీ సంఘాల నేతలు, జిల్లాప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

తండ్రి స్పీకర్‌.. తనయుడు డెప్యూటీ స్పీకర్‌
బాపట్ల నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. కోన ప్రభాకరరావు రాష్ట్ర మంత్రిగా, స్పీకర్‌గా, మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు. అప్పట్లో తండ్రి కోన ప్రభాకర్‌ స్పీకర్‌గా పనిచేయగా, ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించడం విశేషం. మృదుస్వభావి అయిన కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్‌ పదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top