మోసాల్లో తండ్రీకొడుకులు నంబర్‌ వన్‌

Gudivada amarnath fires on chandrababu, lokesh - Sakshi

 సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజం

లక్ష ఇళ్లు, లక్ష ఉద్యోగాలంటూ మోసం చేస్తున్నారు

విశాఖకు సీఎం చుట్టపుచూపుగా వస్తున్నారని మండిపాటు

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణం): ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి లోకేశ్‌బాబు మోసాల్లో నంబర్‌ వన్‌ అని వైఎస్సార్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. లక్ష ఇళ్లు ఇస్తున్నామని చంద్రబాబు, లక్ష ఉద్యోగాలు ఇస్తున్నామని లోకేశ్‌ ఇద్దరూ రాష్ట్ర ప్రజల్నిమోసం చేస్తుంటే కొందరు మంత్రులు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని మండిపడ్డారు. ఇక్కడి పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చుట్టం చూపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వచ్చి హోటళ్లలో సభలు, సమావేశాలు నిర్వహించి వెళ్లిపోవడం ఆనవాయితీగా మారిందన్నారు. హుద్‌హుద్‌ తుపాను వచ్చి మూడేళ్లయినా నిరాశ్రయులకు ఎటువంటి సాయం చేయకపోగా వారిని మళ్లీ మోసగిస్తున్నారని మండిపడ్డారు.

ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరిస్తే హుద్‌హుద్‌లో లక్షా 50 వేల మంది నిరాశ్రయులైనట్టు తేలిందన్నారు. విశాఖపట్నం బ్రాండ్‌ ఇమేజ్‌ను టీడీపీ దెబ్బతీస్తోందని విమర్శించారు. విశాఖలో భూదందాపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌ వల్ల ఇటు భూములు కోల్పోయిన బాధితులకు గాని, ప్రభుత్వానికి గాని ఎటువంటి ఉపయోగం లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు విశాఖను వాడుకున్నారే తప్ప ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మెడ్‌టెక్‌ భూముల కుంభకోణంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆరున్నరేళ్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన పసుపులేటి ఉషాకిరణ్‌ను ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన నేపథ్యంలో మాజీ కార్పొరేటర్‌ గరికిన గౌరిని పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలిగా నియమించామన్నారు.

ఈ సందర్భంగా గరికిన గౌరి మాట్లాడుతూ పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందనడానికి తనను మహిళ విభాగం నగర అధ్యక్షురాలిగా నియమించడమే ఉదాహరణ అని చెప్పారు. చంద్రబాబు అరాచకాలపై వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తలు పసుపులేటి ఉషాకిరణ్, సత్తి రామకృష్ణారెడ్డి, బీసీడీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పక్కి దివాకర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి కొండా రాజీవ్‌గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top