నవంబర్‌ 1 తర్వాత మారిన గూగుల్‌ ట్రెండ్స్‌

Google Trends Regarding Telangana Elections - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ నెటిజన్లు ఎక్కువగా ఏయే విషయాలపై గూగుల్‌లో వెతుకులాట సాగిస్తున్నారో తెలిసిపోయింది.  తాజాగా విడుదలైన గూగుల్‌ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే.. గత 90 రోజులుగా తెలంగాణలోని చాలా మంది నెటిజన్లు ‘2018 తెలంగాణ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు’ అనే విషయంపై ఎక్కువగా వెతుకులాట సాగిస్తున్నారు. అంతేకాకుండా రాజకీయ పార్టీలు, నేతల గురించి కూడా నెటిజన్లు ఎక్కువగా సెర్చ్‌ చేస్తున్నట్టు తేలింది. సెప్టెంబర్‌ 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచి గూగుల్‌లో ‘టీఆర్‌ఎస్‌’ కోసం ఎక్కువ వెతుకులాట సాగింది. ఆ తర్వాత నవంబర్‌ 1వ తేదీ వచ్చేసరికి కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కోసం నెటింట్లో వెతికేవారి సంఖ్య సమానంగా ఉంది.

కాగా, గత 20 రోజులుగా మాత్రం నెటిజన్లు టీఆర్‌ఎస్‌ కన్నా ఎక్కువగా కాంగ్రెస్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి నెటింట్లో కాంగ్రెస్‌ కోసం వెతికే వారి సంఖ్య పెరిగింది. అలాగే మహాకూటమి కోసం వెతికేవారి సంఖ్యలో కూడా పెరుగుదల నమోదయింది.

నేతల విషయానికి వస్తే.. కేసీఆర్‌ గురించి ఎక్కువగా శోధన జరుగుతుండగా, ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కన్నా రేవంత్‌కు హిట్స్‌ ఎక్కువగా ఉన్నాయి.  కేసీఆర్‌ కోసం వెతికేవారిలో.. ఆయన సభలు, స్పీచ్‌లు, కేసీఆర్‌ మెడికల్‌ కిట్స్‌ మీద ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కోసం వెతికేవారిలో.. చాలా మంది ఆయన ఫోన్‌ నంబర్‌, వాట్సప్‌ నంబర్‌ కోసం సెర్చ్‌ చేస్తున్నారు. రేవంత్‌ నియోజకవర్గం, ఫ్యామిలీ ఫొటోస్‌ కోసం నెటిజన్లు ఎక్కువగా శోధిస్తున్నారు. భారత్‌ వెలుపల.. యూఏఈ, సౌదీ అరేబియా, యూఎస్‌, సింగపూర్‌లలో తెలంగాణ ఎన్నికల గురించి ఎక్కువగా సెర్చ్‌ జరుగుతుంది. అలాగే నెటిజన్లు ఏపీ సీఎం చంద్రబాబు కన్నా ఎక్కువగా కేసీఆర్‌ కోసమే గూగుల్‌లో అధికంగా శోధిస్తున్నారని తేలింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top