‘గొంగిడి’కి నిరసన సెగ

Gongidi Suntiha got Protest from the TRS dissident group - Sakshi

ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ అసంతృప్త వర్గం

రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త వర్గం నుంచి నిరసన ఎదురైంది. ఆదివారం ఆలేరు నియోజకవర్గంలోని రాజాపేట మండలం చల్లూరు గ్రామానికి ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ క్రమంలో డప్పు వాయిద్యాలు నిర్వహిస్తున్న బొద్దు సురేశ్‌ ఎమ్మెల్యేకు అడ్డుగా ఉండటాన్ని గమనించి పక్కకు జరగమని ఓ వ్యక్తి అనడంతో గొడవ మొదలైంది. దీంతో అసంతృప్త వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కలుగజేసుకుని ఉద్యమ సమయం నుంచి టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

గొడవకు కారణమైన బొద్దు సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మనస్తాపానికి గురైన అతను ఒంటిపై పెట్రోల్‌ పోసుకోవటంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు, టీఆర్‌ఎస్‌ అసంతృప్తవాదుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ అర్ధనగ్నంగా వారి వాహనం ఎదుట బైఠాయించి, పోలీసుల జులుం నశించాలి, సునీత గో బ్యాక్, కేసీఆర్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు కలుగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top