‘ఏపీలో ఇంత దుర్భరస్థితి ఎన్నడూ చూడలేదు’

Gadikota Srikanth Reddy And Ravindranath Reddy Fire On Chandrababu - Sakshi

సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు ముఖంలో చిరునవ్వులు చూడాలని సకాలంలో రుణాలు మాఫీ చేసేవారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ హెరిటేజ్ సంస్థను బాగు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంత దుర్భర పరిస్థితి ఎన్నడూ లేదన్నారు. దళారులు దోచుకుంటున్నా, నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 

రైతుల ముఖంలో చిరునవ్వులు కోరుకునే వైఎస్సార్ కోటి ఎకరాలకు నీరివ్వాలని నిరంతరం తపించేవారని, కానీ చంద్రబాబు ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని మండిపడ్డారు. సొంత సంస్థ హెరిటేజ్ ద్వారా రాష్ట్రంలో పాడి పరిశ్రమను చంద్రబాబు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నిత్యం వైఎస్ జగన్‌ను విమర్శించడం తప్ప.. రైతుల గురించి ఏ రోజు మాట్లాడలేదని, వారిని ఎందుకు పట్టించుకోలేదని ఈ సందర్భంగా గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఒక్క పైసా కూడా ఇవ్వని ఏపీ ప్రభుత్వం
5 వేల కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి అన్నారని, కానీ ఒక్క పైసా ఇవ్వలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పంటలకు మద్దతు ధర కల్పించలేదన్నారు. ఆత్మహత్యలకు ప్రభుత్వాలు పరోక్షంగా కారణం అవుతున్నాయని పేర్కొన్న ఆయన.. వైఎస్ జగన్ సీఎం కాగానే రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇన్‌పుట్ సబ్సిడీ సకాలంలో ఇవ్వని కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రుణాలు సకాలంలో మాఫీ చేయని కారణంగా అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. పంటల బీమా అందని పరిస్థితి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వడం లేదంటూ ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన వారు చరిత్ర హీనులవుతారని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top