లంబాడాలను మోసం చేస్తే తండాల్లో తిరగనివ్వం 

Fulfill The Guarantees - Sakshi

12శాతం రిజర్వేషన్లు, మూడెకరాల భూ పంపిణీ హామీ నెరవేర్చాలి

గిరిజన చైతన్య యాత్ర సదస్సులో వక్తలు  

పరిగి వికారాబాద్‌ : గిరిజనులకిచ్చిన హామీలు నెరవేర్చకుంటే కేసీఆర్‌ను గద్దె దింపుతామని గిరిజన చైతన్య వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్‌ కరాటే రాజు నాయక్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు సంపత్‌ నాయక్‌ అన్నారు. పరిగి మార్కెట్‌ యార్డులో గిరిజన చైతన్య యాత్ర జిల్లా సదస్సును మంగళవారం నిర్వహించారు. అంతకు ముందు ఆ సంఘం నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మార్కెట్‌ యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ    తండాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాల  పకడ్బందిగా అమలుచేయడం ద్వారా గిరిజన అభ్యున్నతికి బాటలు వేయాలన్నారు.

లంబాడాలను మోసం చేస్తే తండాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. దేశంలోని ఒకే ఆచారం, ఒకే సాంప్రదాయం, ఒకే సంస్కృతి కలిగిన లంబాడాలనందరిని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించటంతో పాటు మూడెకరాల భూమి పంపిణీ హామీని వెంటనే నెరవేర్చాలన్నారు.

లంబాడా ఆదివాసీల మధ్య వైరుధ్యాలు సృష్టిస్తున్న కుట్రలకు మోసపోవద్దని వారు పిలుపునిచ్చారు. సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని సెలవుదినంగా ప్రకటించి అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాబో యే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని తండాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకుందామని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గిరిజన చైతన్య యాత్ర ఆయా జిల్లాల కో ఆర్డినేటర్లు, నా యకులు గోవింద్‌నాయక్, గట్టెనాయక్, శంకర్‌నాయక్, సేవ్యానాయక్, శ్రీనివాస్, గోపాల్, పరశురామ్, సూర్యా, నెహ్రూనాయక్‌ పాల్గొన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top