‘రక్షణ’ కమిటీలో ప్రజ్ఞా, ఫరూక్‌

Farooq Abdullah, Pragya Thakur in parliament defence consultative panel - Sakshi

ప్రజ్ఞాకు స్థానంపై కాంగ్రెస్‌ మండిపాటు

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకి వచ్చే బీజేపీ ఎంపీ సాథ్వి ప్రజ్ఞాసింగ్‌కు పార్లమెంట్‌ కీలక కమిటీలో ప్రభుత్వం చోటు కల్పించింది. ఈమెతోపాటు ప్రజా భద్రత చట్టం(పీఎస్‌ఏ)కింద నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లా(81)పేరును పార్లమెంట్‌ రక్షణ రంగ సంప్రదింపుల సంయుక్త కమిటీకి ప్రతిపాదించినట్లు  తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలో బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ యశో నాయక్, మాజీ రక్షణ మంత్రి, ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తదితరులు ఉన్నారు.

21 మంది ఉండే ఈ కమిటీలో 12 మంది లోక్‌సభ, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రక్షణ కమిటీలో చోటు లభించిన భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ 2008లో జరిగిన మాలేగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలు. మహాత్మాగాంధీని పొట్టనబెట్టుకున్న నాథూరాం గాడ్సేను దేశభక్తుడంటూ లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజ్ఞా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. 

తీవ్రభావ జాలాన్ని వ్యాప్తి చేస్తున్న ఒక సభ్యురాలికి ఎంతో ముఖ్యమైన రక్షణ సంబంధ కమిటీలో స్థానం కల్పించడం దురదృష్టకరమని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. అదేవిధంగా, శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదం ఉందంటూ ప్రభుత్వం ఫరూక్‌ అబ్దుల్లాను మూడు నెలలుగా పీఎస్‌ఏ కింద గృహ నిర్బంధంలో ఉంచింది. జమ్మూకశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో మాజీ సీఎంలు  ఒమర్, మెహబూబా ముఫ్తీ సహా పలువురిని ప్రభుత్వం నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top