అన్న రాజకీయాల కోసం.. తమ్ముడి తప్పటడుగులు!

Ex MP Vivekanand graph downs after Assembly elections - Sakshi

తెలంగాణ రాష్ట​ తొలి సీఎంను ఓ దళితుడినే చేస్తానని కేసీఆర్‌ ప్రకటించిన సమయంలో.. ఆ జాబితాలో ఉన్న కీలక వ్యక్తుల్లో పెద్దపల్లి మాజీ ఎంపీ, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు గడ్డం వివేకానంద ఒకరు. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తన తండ్రి జి.వెంకటస్వామి కాలంనాటి నుంచి వారసత్వంగా వస్తున్న పెద్దపల్లి ఎంపీ సీటు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున తెచ్చుకోలేకపోయారు. అన్న వినోద్‌ విషయంలో తమ్ముడు వివేక్‌ వేసిన తప్పటడుగులే ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించిందా అంటే అవుననే  అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

2013లో తెలంగాణ ఉద్యమం చివరిదశలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఎంపీగా ఉంటూనే తన సోదరుడు వినోద్‌తో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన ఎన్నికలముందు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అప్పట్లో వివేక్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీ సీటు ఖరారైనప్పటికీ.. తన సోదరుడు వినోద్‌కు చెన్నూరు టికెట్‌ ఇవ్వని కారణంగా పార్టీని వీడారు. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేక్‌ టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో అనూహ్యంగా బాల్క సుమన్‌కు పెద్దపల్లి ఎంపీ టికెట్టు దక్కింది. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన వివేక్‌పై టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన బాల్క సుమన్‌ ఘనవిజయం సాధించారు. 

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో పెద్దపల్లి టికెట్‌ హామీతో వివేక్‌ మరోసారి టీఆర్‌ఎస్‌లో చేరారు. వివేక్‌కు కేసీఆర్‌ కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అంతేకాకుండా రానున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేక్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదని పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపీ బాల్క సుమన్‌ను చెన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయించారు.

అయితే డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్న వినోద్‌ విషయంలో వివేక్‌ వ్యవహరించిన తీరు, పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని టీఆర్‌ఎస్‌ పార్టీలో ముసలం పుట్టించి చివరికి వివేక్‌కు సీటు దక్కకుండా చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వివేక్‌ సోదరుడు వినోద్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి టికెట్‌ దక్కలేదు. దీంతో బీఎస్పీ నుంచి వినోద్‌ పోటీ చేశారు. అయితే అక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిన్నయ్యకు వ్యతిరేకంగా తన సోదరుడిని గెలిపించేందుకు వివేక్‌ కృషి చేశారని స్థానిక నేతలు కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో పెద్దపల్లి ఎంపీ నియోజక వర్గపరిధిలోని మిగతా ఎమ్మెల్యేలు కూడా తమను ఓడించేందుకు వివేక్‌ ప్రయత్నించారని కేసీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కేటీఆర్‌కు వివేక్‌ వివరణ కూడా ఇచ్చుకున్నారు. అంతేకాకుండా వివేక్‌ తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరిననాటి నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న బాల్కసుమన్‌ నడుమ విభేదాలు కొనసాగుతూ వచ్చాయి.

వివేక్‌కు కేసీఆర్‌, కేటీఆర్‌ స్థాయిలో పరిచయాలున్నా, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను కలుపుకుని పోవడంలో వైఫల్యం చెందారు. ఈ పరిణామాల నేపథ్యంలో వివేక్‌ను కాదని చివరి నిమిషంలో పార్టీలో చేర్చుకొని మరీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకానికి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్‌ చాన్స్‌ ఇచ్చారు. రెండు సందర్భాల్లోనూ అన్న వినోద్‌ కోసం వివేక్‌ చేసిన తప్పిదాలే ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయని స్థానికంగా చర్చ జరుగుతుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top