సోనియా మాటలూ ‘బాబు’ స్క్రిప్టే

'Evil Congress leaders' misled Sonia Gandhi, says TRS - Sakshi

మేడ్చల్‌ సభను స్పాన్సర్‌ చేయడమే కాదు...ఆ సభలో ఆమె మాటలు కూడా చంద్రబాబే రాసిచ్చారు

తెలంగాణపై బీద అరుపులు అరిచి ఏపీపై సానుభూతి కురిపించారు

సోనియాగాంధీ, చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి హరీశ్‌రావు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మేడ్చల్‌ సభలో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆ స్క్రిప్టు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిచ్చినట్లుంది. చంద్రబాబు మేడ్చల్‌ సభను మాత్రమే స్పాన్సర్‌ చేశారనుకున్నాం. కానీ విచిత్రంగా ఆమె ప్రసంగం కూడా చంద్రబాబు రాసి చ్చిన స్క్రిప్ట్‌ అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కూటమి తరఫున ఎవరు పోటీ చేయాలో నిర్ణయించింది చంద్రబాబే. ఇప్పుడు ఎన్నికల ఖర్చు కు డబ్బులు ఇస్తున్నదీ ఆయనే’ అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

తెలం గాణ నడి గడ్డ మీద ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారంటేనే తెలంగాణపట్ల సోనియా గాంధీకి ఉన్న ఉద్దేశమేమిటో స్పష్టమవుతోందని విమర్శించా రు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన హరీశ్‌రావు శనివారం అడ్డాకులలో విలేకరులతో మాట్లాడారు. మేడ్చల్‌ బహిరంగ సభలో సోనియా తెలంగాణపై బీద అరుపులు, ఏడుపులు ప్రదర్శించడం తప్ప ఎన్నికల్లో గెలిపిస్తే చేయబోయే కార్యాచరణ ఏదీ ప్రకటించలేదని విమ ర్శించారు. పైగా ఏపీ మీద సానుభూతి కురిపించడం చూస్తే తెలంగాణలో సమావేశం పెట్టి ఏపీకి హామీలు ఇచ్చినట్లు కనిపిస్తోందని, ఇవన్నీ గమనిస్తే ఎన్నికలు, బహిరంగ సభను స్పాన్సర్‌ చేసిన బాబుకు కాంగ్రెస్‌ గులాం అయినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

తెలంగాణకు ఇచ్చిన హామీలేమయ్యాయి?
‘ఏపీతో సరిసమానంగా తెలంగాణకు పారిశ్రామిక నిర్మాణంలో రాయితీలు ఇస్తామని పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి ప్రకటించారు. ఆ విషయాన్ని మీరు గడచిన ఎన్నికల్లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ చెప్పారు. మరి ఈరోజు వాటిని ఎందుకు చెప్పలేకపోయారు. తెలంగాణలో కొత్త పరిశ్రమలు రావు... అందరూ తీసుకెళ్లి ఏపీలో వాటిని పెట్టాలని చెబుతున్నారా? తెలంగాణలో నిరుద్యోగం పెరగాలి... ఉద్యోగ అవకాశాలు రావొద్దు.. తెలంగాణకు ఆదాయం పడిపోవాలి... పరిశ్రమలు రావొద్దనే కదా మీరు చెప్పింది. మీ వ్యాఖ్యలు యువకుల భవిష్యత్తును అంధకారం చేసేలా ఉన్నాయి. ఆనాడు విభజన బిల్లులో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు తప్ప.. తెలంగాణకు మొండి చెయ్యి చూపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అభ్యంతరం లేదు.. ఆ రోజు ప్రధాని చెప్పిన విధంగా తెలంగాణకు కూడా పారిశ్రామిక రాయితీలు సమానంగా ఇవ్వండని అడిగితే మీరు ఏమీ మాట్లాడటం లేదు. హైకోర్టు విభజన, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీల విషయమై పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తుంటే.. కాంగ్రెస్‌ ఎంపీలు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఐటీఐఆర్, ముస్లిం, ఎస్టీల రిజర్వేషన్ల విషయంలో ఎందుకు మద్దతు ఇవ్వలేదు? కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల జాతీయ హోదా కోసం టీఆర్‌ఎస్‌ చేసిన ఆందోళనలకు కాం గ్రెస్‌ ఎందుకు స్పందించలేదు? అదే ఏపీకి ప్రత్యేక హోదా కోసం మాత్రం చంద్రబాబు సూచన మేరకు పార్లమెంటును స్తంభింప చేయడం వెనుక మర్మం ఏమిటి?’అని సోనియాను హరీశ్‌రావు నిలదీశారు.

దుఃఖం ఎందుకు వస్తోంది?
‘తెలంగాణలో అధికారం లేనందుకా.. లేదా తిరిగి అధికారంలోకి రాలేమనే అర్థమైనందుకు దుఃఖిస్తున్నారా?’అని హరీశ్‌రావు సోనియా గాంధీని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్‌ వంటి మంచి నాయకుడు కాంగ్రెస్‌లో లేనందుకు ఈరోజు సోనియా దుఃఖ పడుతున్నట్లుందని ఎద్దేవా చేశారు. అంతకు మించి సోనియా గాంధీ ఎందుకు బాధపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ‘నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే ఆమె గర్వపడాలి. దేశంలోనే తెలంగాణను నంబర్‌ వన్‌ రాష్ట్రంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందుకు సంతోషపడాలి, గర్వపడాలి. కానీ ఆమె అధికారంలో లేనందుకు, ఇక ముందు రానందుకు ఆందోళనలో దుఃఖం వస్తున్నట్లుంది. రైతు బంధు, రైతు భీమా పథకాలు దేశంలోనే విప్లవాత్మకమైన పథకాలు. ఆఖరికి స్వామినాథన్‌ సైతం కేసీఆర్‌ను మెచ్చుకుని అవార్డు ఇచ్చారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని కలగలిపి తెలంగాణను కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంత బాగా అభివృద్ధి చేస్తున్న నాయకుడిని చూసి గర్వపడాల్సింది పోయి.. దుఃఖపడటంలో అర్థం లేదు. మీరంటే మాకు గౌరవం ఉంది. కానీ దుఃఖం వస్తోందంటూ ప్రజలను చిన్న బుచ్చే ప్రయత్నం చేస్తున్నారు’ అని హరీశ్‌రావు అన్నారు.

బాబు సంతకం పెట్టిస్తారా?
‘నాలుగు పార్టీలు కలసి ఎన్నికల మేని ఫెస్టోకు సంబంధించి కామన్‌ మినిమమ్‌ పోగ్రాం (సీఎంపీ) పెడతామంటున్నారు కదా. అధికారంలోకి వస్తే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కడతామని సీఎంపీలో చేరుస్తారా? దాని మీద చంద్రబాబు సంతకం తీసుకుంటారా? ఈ ప్రాజె క్టు కడితే అభ్యంతరం లేదని బాబు నోటి నుంచి చెప్పిస్తారా? అలా చేసిన తర్వాతే పాలమూరు ప్రజల ఓట్లు అడగాలి’ అని హరీశ్‌ డిమాండ్‌ చేశారు. కేవలం 8 నెలల్లో పూర్తి చేసిన తుమ్మిళ్ల ప్రాజెక్టును కూడా అడ్డుకోవడానికి బాబు శతవిధాలా ప్రయత్నిం చారన్నారు. ఉమ్మడి ఏపీలో ఆర్డీఎస్‌ ను ఎండబెట్టి.. నీళ్లన్నీ కేసీ కెనాల్‌ ద్వారా తీసుకుపోయారని ఆరోపించారు. తుమ్మిళ్ల విషయంలో బాబు రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకోవడానికి బాబు చేయని యత్నం లేదన్నారు. ఆయన ఎన్ని కొర్రీలు పెట్టినా, అపెక్స్‌ కమిటీలో కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినా కేసీఆర్‌ బల్లగుద్ది మరీ ప్రాజెక్టును కట్టి తీరుతామని స్పష్టం చేశారని హరీశ్‌ గుర్తుచేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top