‘కన్నడ’ కథ సుఖాంతం!

End of Karnataka political crisis - Sakshi

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తప్పే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ వైపు ఆకర్షితులయ్యారని భావించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సొంత పార్టీకే విధేయత ప్రకటించి తిరిగొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో శుక్రవారం జరిగే సీఎల్పీ భేటీలో వారంతా పాల్గొనే అవకాశాలున్నాయి.  ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష బీజేపీ చేసిన ప్రయత్నం విఫలమైందని చాటిచెప్పడమే లక్ష్యంగా తన బలం చాటుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అంతర్గత అసమ్మతిని చల్లార్చేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నేటి సమావేశానికి గైర్హాజరైతే తీవ్ర పరిణామాలుంటాయని తమ ఎమ్మెల్యేలను సిద్దరామయ్య హెచ్చరించారు. పార్టీలోకి తిరిగిస్తున్న అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తారా? అని సిద్దరామయ్యను ప్రశ్నించగా..ఆయన బదులిస్తూ మంత్రి పదవులిస్తామని ఎవరికీ చెప్పలేదని, కాంగ్రెస్‌లో అసలు అసంతృప్తే లేదన్నారు.

బీజేపీకి మిగిలింది భ్రాంతే: కుమారస్వామి
కాంగ్రెస్‌– జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఏ ప్రయత్నాలు ఫలించబోవని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. జనవరి 15 తర్వాత బీజేపీకి సం‘క్రాంతి’ అని పలికిన ఆ పార్టీ నేతలకు చివరికి సం‘భ్రాంతి’ మిగిలిందని ఎద్దేవా చేశారు. గురువారం విధానసౌధలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను రెండు, మూడు రోజులు విదేశీ పర్యటనకు వెళ్తే విమర్శించిన బీజేపీ నేతలు ఇప్పుడు మొబైల్‌ ఫోన్లను స్విచ్‌ ఆఫ్‌ చేసుకుని గురుగ్రామ్‌ హోటల్‌లో ఏం చేస్తున్నారని నిలదీశారు.  

‘ఆపరేషన్‌ కమల’ చేపట్టలేదు: యడ్యూరప్ప  
వచ్చే లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై చర్చించేందుకే తమ ఎమ్మెల్యేలు గురుగ్రామ్‌ వెళ్లినట్లు బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు యడ్యూరప్ప వెల్లడించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తాము ప్రయత్నించడం లేదని, కాంగ్రెస్‌– జేడీఎస్‌ అంతర్గత పోరుకు బీజేపీని నిందించడం సబబుకాదన్నారు. బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్తే కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకని ప్రశ్నించారు. 104 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గురుగ్రామ్‌ నుంచి బెంగళూరుకు బయల్దేరినట్లు తెలిసింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top