ష్‌.. క్యాష్‌..! | Election Commission Creating Special Teams for Inspection | Sakshi
Sakshi News home page

ష్‌.. క్యాష్‌..!

Nov 5 2018 4:47 AM | Updated on Nov 5 2018 7:25 PM

Election Commission Creating Special Teams for Inspection - Sakshi

‘ధనం మూలం..ఇదం ఎలక్షన్‌’ అన్నట్లుగా మారింది పరిస్థితి. అసలు డబ్బు లేనిదే..మద్యం పారనిదే ఎన్నికలు లేవు. ఇది ప్రతి ఎన్నికల్లోనూ చూస్తున్నాం. కోట్లాది రూపాయల నగదు, లక్షల లీటర్ల మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకుంటూనే ఉంటారు. ఇక పట్టుబడనిది ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈసారీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు రూ.కోట్లలో డబ్బు సిద్ధం చేశారని వార్తలు వస్తున్నాయి. నోటిఫికేషన్‌కు ముందే...రాష్ట్రంలో ఇప్పటికే రూ.55 కోట్ల నగదు, 65 వేల లీటర్ల మద్యం పట్టుబడడం ఇందుకు నిదర్శనం.

ఇక వీటికి తోడు బహుమతులు, కూపన్లు.. ఇలా అనేక రకాల ప్రలోభాలు ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అటు పార్టీలు, అభ్యర్థులు ఈ ప్రలోభాల కోసం ప్రత్యేకంగా వారి మనుషులతో బృందాలను ఏర్పాటుచేసుకుంటారు. ఎన్నికల నామినేషన్‌ నుంచి ఎన్నికల రోజు వరకు ఏదో విధంగా ప్రలోభపర్వం కొనసాగుతూనే ఉంటుంది. 2014 ఎన్నికల్లో భారీ స్థాయిలో నగదు సరఫరాకు అన్ని పార్టీలు ప్రయత్నించాయి. వీటిని అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్, పోలీస్‌ విభాగం శ్రమించాయి. ఈమేరకు 2014లో తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం రూ.122.94 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో కేవలం రూ.43.90 కోట్లకు మాత్రమే ఆధారాలు చూపించి సంబంధిత వ్యక్తులు నగదును తీసుకెళ్లారు.

89 కేజీల బంగారం... 
గత సాధారణ ఎన్నికల సందర్భంగా ఎలాంటి రశీదులు, బిల్లులు లేకుండా ఉన్న 89.3 కేజీల బంగారాన్ని ప్రత్యేక బృందాలు చెక్‌పోస్టులు, ప్రత్యేక తనిఖీల ద్వారా పట్టుకున్నారు. అదే విధంగా 821 కేజీల వెండిని సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బంగారం జీరో దందా కింద చెన్నై, ముంబయి, పూణే తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లోని వ్యాపారులకు చేరేందుకు సరఫరా అయినట్టు అధికారులు గుర్తించారు. కానీ ఏ ఒక్కరు కూడా ఈ బంగారం, వెండిని తమదంటూ క్లెయిమ్‌ చేసుకోకపోవడం సంచలనంగా మారింది.  
 
లక్షల్లో మద్యం బాటిళ్లు... 
గడిచిన ఎన్నికల్లో డబ్బుతో పాటు మద్యం కూడా భారీ స్థాయిలో ప్రత్యేక బృందాలకు పట్టుబడింది. వందలు కాదు వేలు కాదు ఏకంగా కొన్ని లక్షల మద్యం బాటిళ్లను పోలీస్, ప్రత్యేక బృందాలు పట్టుకున్నాయి. అక్షరాలా 32 లక్షల 18 వేల 143 మద్యం బాటిళ్లను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌ సీజ్‌ చేసింది. ఎక్కువగా రాత్రి వేళల్లో వాహనాల్లో డబ్బు, మద్యం రవాణా చేస్తూ పట్టుబడ్డారు. మరి ఈ సారి రికార్డు బ్రేక్‌ అవుతుందా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.  

రాష్ట్రంలో 12వేల లైసెన్స్‌డ్‌ ఆయుధాలు
ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్‌డ్‌ ఆయుధాల డిపాజిట్‌పై పోలీస్‌ శాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలో 12 వేల లైసెన్స్‌డ్‌ ఆయుధాలున్నాయి. ఇందులో భాగంగా ఏయే జిల్లాలో, ఏయే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎన్ని ఉన్నాయి? ఎవరెవరు ఆయుధాలు ఉపయోగిస్తున్నారు? ఎక్స్‌ సర్వీస్‌మెన్స్‌ ఎంత మంది అన్న లెక్క తేలనుంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో పోలీస్‌ శాఖ త్వరలో ప్రతీ జిల్లా, కమిషనరేట్‌ పరిధిలో ఆయుధాల డిపాజిట్‌కు నోటిఫికేషన్‌ జారీచేయబోతోంది. లైసెన్స్‌ వెపన్‌ కల్గిన ప్రతీ వ్యక్తి సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్‌ చేయాలి.
-ఐరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement